పాలకుల నిర్లక్ష్యానికి చేనేత బలి

Article On Handloom sector Situation In India - Sakshi

విశ్లేషణ

చేనేత రంగం భారత దేశంలోనే అనాది కాలంగా వస్తున్న వృత్తి. అనేక దశాబ్దాలలో ఈ రంగం అనేక మార్పులు చెంది, పరిణతి చెందుతూ తన ఉనికిని కాపాడుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పటికి అనైతిక పోటీని ఎదుర్కొంటూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ రంగం, 1990 దశాబ్ది చివరకు కష్టాలలో పడింది. ప్రపంచ వాణిజ్య ఏర్పాటు, అందులో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందం, తదనంతరం భారత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేత రంగానికి చేటు తీసుకు వచ్చినాయి. ఉపాధి పేరిట ఉపాధిని భక్షించే పాలక నిర్ణయాలు, చేనేత రంగాన్ని దెబ్బ తీసే పరిస్థితిని సృష్టిం చినాయి. రాజకీయ పార్టీలు, నాయకులూ, ఆయా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే, ఇంకొక పక్క అధికారం రాగానే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆధునిక జౌళి పరిశ్రమకు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి.

కుల రాజకీయాలు పెరుగుతున్న క్రమంలో, అనేక కులాలకు చెందిన చేనేత కుటుంబాలు ఒక ఓటు బ్యాంకుగా ఆయా రాజకీయ పార్టీలకు కనిపిం చలేదు. చేనేత వృత్తిని నమ్ముకుని, ఆయా రాష్ట్రాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ఒకే కులస్తులు కొంత ఒత్తిడి చేయగల్గినా, ఎన్నికల తదనంతరం వారికిచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. గత ఇరవై ఏళ్ల కాలంలో, అనేక మంది పద్మశాలీలు, ఇతర వృత్తులకు మళ్లడంతో, ‘చేనేత’ వృత్తికి రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఈనాడు, అన్ని రాజకీయ పార్టీలలో చేనేత అనుబంధ విభాగాలు ఉన్నా, అవి ఆశించినంత మేర పార్టీ నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టలేకపోతున్నాయి. ప్రధాన, జాతీయ పార్టీలలో చేనేత విభాగాలు ‘కుల’ రాజకీయాలకే పరిమితమయినాయి. గత పదిహేను ఏళ్లలో, కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, చేనేత రంగం ఆశి స్తున్న నిధుల కేటాయింపు పెరగలేదు. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు.

చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం కేవలం రూ. 107 కోట్లే. ఈ రాజకీయ, పాలక నిర్లక్ష్యం ఫలితమే  చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాజకీయంగా సాధించలేనిది, ఆత్మహత్యల ద్వారా తమ గోడు ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించగలిగారు. ఫలితంగా 2012–13లో, చేనేత కేటాయింపు రుణమాఫీ పథకంతో కలిపి రూ.2,960 కోట్లకు పెరిగింది. చేనేత రుణ మాఫీ పథకం అమలు కాలేదు. అప్పులు పెరుగుతున్న తరుణంలో ఆదాయం పెరగక ఇబ్బందులూ పడుతున్న చేనేత కుటుంబాల మీద గోరు చుట్టు మీద రోకటి పోటు లాగ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమస్యలు ఇంకా జటిలం అయినాయి. ఎన్నడూ లేని పన్నులు చేనేత మీద భారం విపరీతంగా పెంచాయి. చేనేత వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది.

2019–20 వోట్‌–అన్‌–అకౌంట్‌ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది రూ. 456.80 కోట్లు. 2018–19లో కేటాయించింది రూ. 396.09 కోట్లు. 2017–18లో కేటాయించింది రూ. 604 కోట్లు, ఖర్చు చేసింది రూ. 468.98 కోట్లు. ఎన్నికల సమయంలో కూడా చేనేతకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ మినహాయింపు గురించి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. రుణ మాఫీ పథకానికి ఇచ్చిందే తక్కువ. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 95 శాతం చేనేత కుటుంబాలకు ఈ పథకం చేరనేలేదు. మళ్లీ రుణ మాఫీ ప్రకటించలేదు. చేనేత రంగంలోని కుటుంబాలు అప్పులతో కుదేలు అవుతున్న పరిస్థితులలో చేనేత రుణ మాఫీ 2019–20 బడ్జెట్లో ప్రకటించి ఉంటే చేనేత కార్మికులు సంతోషించేవారు.

చేనేతపై వివక్ష ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. కేటాయింపులు ఎన్ని ఉన్నా, రాజకీయంగా పోరాడి సాధించుకున్నా, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ పాటి కేటాయిం పులు సరిగ్గా ఖర్చు కాకపోవడం చేనేత రంగాన్ని పీడిస్తున్న పాలనాపరమైన అంశం. 2012–13లో రూ. 2,960 కోట్లు కేటాయిస్తే, రూ.793.28 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎనిమిది  సంవత్సరాల కాలంలో ఖర్చు వివరాలు గమనిస్తే కేటాయింపు కంటే ఖర్చు తక్కువగానే ఉంది.

2014 ఎన్నికలలో చేనేత రంగానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆశ కలిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చేనేతలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అనేక ప్రాంతాలలో బహుముఖ పోటి ఉన్న తరుణంలో చేనేతల మద్దతు చాలా అవసరం అవుతుంది. చేనేత మద్దతు కోరే నాయకులూ పార్టీలు ఈ రంగానికి మద్దతు ఇచ్చే హామీలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే వారికి కావాల్సిన ఓట్లు వస్తాయి.  చివరిగా, సమగ్ర చేనేత అభివృద్ధి మా లక్ష్యం అని ప్రకటిస్తే చేనేత కుటుంబాలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.


డి. నరసింహారెడ్డి 
వ్యాసకర్త ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top