ఇటు రాజీనామాలు.. అటు 'రాజీ' డ్రామాలు!! | resignations on one side, dramas on the other for united state | Sakshi
Sakshi News home page

ఇటు రాజీనామాలు.. అటు 'రాజీ' డ్రామాలు!!

Sep 26 2013 1:24 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఇటు రాజీనామాలు.. అటు 'రాజీ' డ్రామాలు!! - Sakshi

ఇటు రాజీనామాలు.. అటు 'రాజీ' డ్రామాలు!!

ఒకవైపు సమైక్య రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమిస్తుంటే, మరోవైపు ఇతర పార్టీల వారు 'రాజీ' డ్రామాలు ఆడుతున్నారు.

ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అందరూ రాజీనామాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక డిమాండుతో సీమాంధ్ర ప్రాంతంలో 57 రోజులుగా ఉధృతంగా సమ్మె సాగుతోంది. ఇంత జరుగుతున్నా.. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. వాళ్లు రాజీనామాల ఊసెత్తితే ఒట్టు!!

విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. రెండు నెలల నుంచి జీతాలను సైతం వదులుకుని, జీవితాలను పణంగా పెట్టి రోడ్లమీదే ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులు రెండు నెలల నుంచి కదలట్లేదు. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. ఇంత జరుగుతున్నా.. నాయకుల్లో మాత్రం చలనం లేదు. జాతీయస్థాయిలో పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల సీమాంధ్ర ప్రాంతంలో ఏహ్యభావం కలుగుతోంది.

వారి దిష్టిబొమ్మలను రకరకాల రూపాల్లో తయారుచేస్తూ, ఎంతగా విమర్శలు కురిపిస్తున్నా నాయకులలో స్పందన కనిపించడంలేదు. తాము రాజీనామాలు సమర్పించేశామని, అయితే వాటిని ఆమోదించేందుకు స్పీకర్ మీరాకుమార్ అందుబాటులో లేరని ఒకసారి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దని చెప్పడం వల్లే రాజీనామాలు చేయడంలేదని మరోసారి.. ఇలా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెబుతూ అధిష్ఠానంతో 'రాజీ' పడిపోయి డ్రామాలు ఆడుతున్నారు.

సమైక్యాంధ్రకు బహిరంగంగా మద్దతు పలికే పార్టీలను మాత్రమే తాము ఉద్యమంలోకి సాదరంగా ఆహ్వానిస్తామని, ఒకవైపు సమైక్యం అన్న మాట చెబుతూ మరోవైపు అధిష్ఠానం మాటలకు గంగిరెద్దుల్లా తలాడించేవారిని తరిమి తరిమి కొడతామని ఉద్యోగులు, సమైక్యంధ్ర ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఇంకెంత కాలం ఈ నాయకులు 'రాజీ'డ్రామాలు ఆడుతారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement