దావూద్ ఇబ్రహీం.. నువ్వెక్కడ? | Dawood Ibrahim.. where are you? | Sakshi
Sakshi News home page

దావూద్ ఇబ్రహీం.. నువ్వెక్కడ?

Sep 27 2013 10:21 AM | Updated on Sep 1 2017 11:06 PM

దావూద్ ఇబ్రహీం.. నువ్వెక్కడ?

దావూద్ ఇబ్రహీం.. నువ్వెక్కడ?

ముంబైలో ఓ సామాన్య పోలీసు కానిస్టేబుల్ కొడుకు.. కట్ చేస్తే, 1993 నాటి ముంబై పేలుళ్ల సూత్రధారి!! చీకటి సామ్రాజ్య అధినేత. ఎన్నెన్నో మాఫియా సినిమాలకు స్ఫూర్తిదాయకుడు. అతడు ఇంకెవరో కాదు.. దావూద్ ఇబ్రహీం.

ముంబైలో ఓ సామాన్య పోలీసు కానిస్టేబుల్ కొడుకు.. కట్ చేస్తే, 1993 నాటి ముంబై పేలుళ్ల సూత్రధారి!! చీకటి సామ్రాజ్య అధినేత. ఎన్నెన్నో మాఫియా సినిమాలకు స్ఫూర్తిదాయకుడు. అతడు ఇంకెవరో కాదు.. దావూద్ ఇబ్రహీం కస్కర్. ఎంతోమంది మాఫియా డాన్లను తయారుచేసి వాళ్లందరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది కూడా దావూద్ ఇబ్రహీమే. ఒకప్పుడు ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మీర్జా, వరదరాజన్ మొదలియార్, అబ్దుల్ కరీం లాలా, బాషూ దాదా.. వీళ్లే ఉండేవాళ్లు. ఇలాంటి కరడుగట్టిన వాళ్ల మధ్య ఓ నిజాయితీ గల కానిస్టేబుల్.. ఇబ్రహీం కస్కర్. అతడి రెండో కుమారుడే దావూద్ ఇబ్రహీం కస్కర్. చదువు వంటబట్టక.. పెడదోవ పట్టాడు. చిన్న చిన్న గొడవలతో మొదలుపెట్టి, అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి ఎదిగాడు. పోలీసులు కూడా.. నగరంలో డాన్లను అణిచేయడానికి ఇతడి సాయం తీసుకున్నారు. కానీ దావూద్ వాళ్ల చేయి దాటిపోయి, తానే ఒక డాన్గా ఎదిగాడు. భారతదేశంలో ఉంటే ఇబ్బంది అవుతుందని దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచే కొన్ని ఆపరేషన్లు చేసిన తర్వాత.. కరాచీకి తరలిపోయాడు. అప్పటినుంచి పాకిస్థాన్లోనే దాక్కున్న దావూద్ ఇబ్రహీంను మన దేశానికి తెచ్చుకోవడం మనవాళ్లకు తలకు మించిన పని అవుతోంది. గతంలో ఓసారి తాను లొంగిపోతానంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీకి దావూద్ కబురు పంపగా, మనవాళ్లు అతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకొనేది లేదంటూ జారిపోనిచ్చారు. ఆ తర్వాత నకిలీనోట్ల చెలామణి లాంటి వ్యాపారాలతో మరింత బలం పెంచుకున్న దావూద్.. ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

 

 

 

1980లలో దావూద్ ఇబ్రహీం ఇలా ఉండేవాడు (కుడి వైపు నుంచి రెండో వ్యక్తి)

ఇన్నాళ్ల బట్టి పాకిస్థాన్లో ఉంటూనే ముంబై నేర సామ్రాజ్యాన్ని శాశిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో సగానికి పైగా అతడి డబ్బులతోనే రూపొందుతున్నాయన్న విషయం కూడా బహిరంగ రహస్యమే. అలాంటి దావూద్ ఇబ్రహీం.. అసలు తమ దేశంలోనే లేడని తాజాగా పాకిస్థాన్ కొత్త పల్లవి అందుకుంది. పాక్ ప్రధానికి అంతర్జాతీయ వ్యవహారాలలోను, జాతీయ భద్రత విషయంలోను సలహాదారుగా వ్యవహరిస్తున్న సర్తాజ్ అహ్మద్ వాషింగ్టన్లో ఈ విషయం సెలవిచ్చారు. దావూద్ ఎక్కడున్నాడో భారత్ తమకు సమాచారం ఇస్తే, అతడిని పట్టుకోడానికి తాము కూడా ప్రయత్నిస్తామని చెప్పారు.

దుబాయిలో దావూద్ సామ్రాజ్య విస్తరణ, తనకు అడ్డువచ్చిన వారినల్లా మట్టుపెట్టడం, బాలీవుడ్లో హంగామా, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మారణహోమం, ఆపై జరిగిన బొంబే స్టాక్ ఎక్స్చేంజి పేలుళ్లు, దావూద్ కరాచికి మకాం మార్చటం, ఛోటా - దావూద్ మధ్య విద్వేషాలు, వాటి ఆధారంగా మన పోలీసులు పరోక్షంగా రాజన్కు సహకరించడం, 9/11 తర్వాత దావూద్ ఇబ్రహీంకు అల్ఖైదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా “మోస్ట్ వాంటెడ్”గా అతడిని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఇన్ని జరుగుతున్నా మన దేశం మాత్రం ఇంతవరకు అతడిని పట్టుకోలేకపోవడం గమనార్హం. లాడెన్ కూడా ఎక్కడున్నాడో తమకు తెలియదని పాక్ చెప్పిన తర్వాతే అమెరికా నేవీ సీల్స్ స్వయంగా ఆ దేశంలో ప్రవేశించి లాడెన్ను మట్టుబెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement