సకారాత్మకమే సమాజ హితం

Service programs by janaki - Sakshi

ఎవరికయితే భవిష్యత్‌ పట్ల సకారాత్మకమైన దృష్టి ఉంటుందో వారే ఈ ప్రపంచానికి ఉపయోగ పడే విధంగా ఉంటారని, భవిష్యత్‌ పట్ల ఎన్నో ఆశలతో వారి దృక్పథాన్ని మార్చుకోగలుగుతారని దాది జానకి అంటారు.ప్రజాపిత బ్రహ్మ కుమారిస్‌ ముఖ్య సంచాలిక దాది జానకి గత 83 సంవత్సరాలుగా తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవకు కైంకర్యం చేశారు. యావత్‌ భారత దేశంలో ఆమె సేవలను అందించిన తరువాత 1974 సంవత్సరంలో లండన్‌లో తమ సేవా కార్యక్రమాలు ఆరంభించారు. 125 దేశాలలో ఈశ్వరీయ సేవలను విస్తరింప చేయడంలో వారి పాత్ర కీలకమైనది. దాది ప్రకాశ మణి పరమపదించిన తరువాత 2007 సంవత్సరం నుండి ముఖ్య సేవా కేంద్రమైన మౌంట్‌ అబు రాజస్థాన్‌లో ముఖ్య ప్రసాసికగా బాధ్యతలను చేపట్టారు.  

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జానకి దాది గొప్ప అధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. వారి ముఖ్య ధ్యేయం వారి మనస్సుని, హృదయాన్ని భగవంతుని కార్యాన్ని నిర్వహించడమే తమ జీవిత లక్ష్యంగా, ఆశయంగా పెట్టుకున్నారు. భగవంతుడు ఒక పవిత్రమైన ప్రేమ జ్ఞానికి ఆధారం అనే అనుభవాన్ని వారు స్వయంగా అనుభవించి, ఆ గుణాలను తమలో నింపుకొన్నారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఎంతోమందికి స్పూర్తిని ఇచ్చింది. జీవితంలో కొత్త ఆశలను కలిగించింది.

ప్రస్తుత సమాజంలో ఉండే స్వార్థ పూరితమైన సంబంధాలు అవగాహన చేసుకొని ఈ ప్రపంచం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని చేరబోతోంది అనే పరిస్థితిని గుర్తించారు కానీ వారి దృష్టి ఎప్పుడూ కూడా సకారాత్మకంగా మానవతా విలువలను పెంచే మంచిని పెంచే విధంగా ఉంటుంది.  ప్రాచీన రాజయోగ విధానాన్ని తిరిగి ఆధునిక విధానంలో ప్రచారం చేయడానికి వారు ఆధారమయ్యారు. ఒక చక్కటి క్రమ శిక్షణ, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా దాది అనేక రంగాల వారికి తిరిగి ఆత్మ విశ్వాసాన్ని తమలో ఎలా చిగురింప చేయాలో తమ సాధన ద్వారా తెలియ చేశారు. ఈ విధంగా నేటిసమాజానికే కాకుండా భవిష్య సమాజ ఉన్నతి కోసం వారు ఎంతో పాటు పడ్డారు.

1916 వ సంవత్సరంలో ఉత్తర భారత దేశంలోని పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుండి ఇతరుల సంక్షేమం కోసమే వారు ఆలోచించేవారు. తమ బాల్య అవస్థలోనే వారి తండ్రితో వారు ఎన్నో అధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ శాకాహారం గురించి ప్రచారం చేసేవారు. అనారోగ్యంగా ఉన్నవారికి, వృద్ధులకి సేవ చేసేవారు.బాల్యం నుండే వారు సత్యాన్వేషణ ప్రారంభించారు. 1937వ సంవత్సరంలో జానకి దాది ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపింప బడిన బ్రహ్మ కుమారిస్‌ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రవేశించారు. ప్రజాపిత బ్రహ్మ పూర్వనామం దాదా లేఖ్‌ రాజ్‌. వారు ప్రముఖ వజ్రాల వ్యాపారి. వారి 61వ సంవత్సరంలో స్వయగా పరమాత్ముని ద్వారా భవిష్యత్తు ప్రపంచం సాక్షాత్కారం పొందారు.

ఒక సత్యమైన, స్వచ్ఛమైన బంగారు ప్రపంచాన్ని నిర్మించడం అనే ఈశ్వరీయ కార్యాన్ని తమ ధ్యేయంగా తమ యావదాస్తిని ఈ సంస్థకు సమర్పించారు. రాజ యోగా అభ్యాసం ద్వారా ఎలా నిద్రాణమైన సత్యమైన శక్తులను జాగృతి చేయవచ్చునో వారు గుర్తించారు.  పరమాత్ముని స్మృతి ద్వారానే స్వయం సంస్కారాలను పరివర్తన చేసుకోవచ్చని తెలుసుకున్నారు. ఈ సమయం లోనే వారు స్త్రీ శశక్తీకరణ కోసం ఎంతో పాటుపడ్డారు. కొంత కాలం తరువాత దాది జానకి ఒక వైపు రాజయోగ అభ్యాసం ద్వారా అతీంద్రియ సుఖాన్ని, అద్భుతమైన శాంతిని ఆనందాన్ని అనుభవం చేస్తూ ఈ సంస్థలో సభ్యులందరూ కూడా శారీరక శ్రమ చేయవలసి వచ్చింది. అదే సమయంలో జానకి దాది ఆ సంస్థలోని సభ్యులకు సేవ చేయడానికి నియమితులైనారు.

1974 సంవత్సరంలో వారు ఈశ్వరీయ ఆదేశం అనుసారంగా విదేశాలలో ఈశ్వరీయసేవలను ఆరంభించడం కోసం భారత దేశాన్ని వదలి వెళ్లారు. లండన్‌ ముఖ్య సేవా కేంద్రంగా చేసుకున్నారు. ప్రేరణాదాయకమైనటువంటి వారి శిక్షణ ద్వారా వ్యక్తిగత అనుభవాల ద్వారా, ఈ అధ్యాత్మిక విశ్వ విద్యాలయం ముఖ్య శిక్షణ లను విదేశీయులు కూడా గుర్తించారు. ఈ విధంగా దాది గారి నేతృత్వంలో దాదాపు 120 దేశాల్లో సేవాకేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఈ ఈశ్వరీయ శిక్షణ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా తమ దైనందిన ఉద్యోగ వ్యవహారాలలో కూడా ఎంతో ఉపయోగ పడుతుందని ఎంతోమంది గుర్తించారు.

దాది జానకి చేతుల మీదుగా ఆధునిక భవన ఆరంభం...
దాది జానకి నేడు బ్రహ్మ కుమారీల దక్షిణ భారత దేశ ముఖ్య రిట్రీట్‌ సెంటర్‌ అయిన శాంతి సరోవర్‌ గచ్చిబౌలిలో ఒక ప్రత్యేక సేవకు ఏర్పాటు చేయబడిన ఇన్నర్‌ స్పేస్‌ అనే ఆధునిక భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు.  ఆధునిక సమాజానికి, యువతకు ప్రత్యేకమైన రీతిలో తర్కబద్ధంగా, శాస్త్రీయంగా ఆంతరంగిక వివేకాన్ని స్వయంగా అనుభూతి చెందడానికి అనువైన రీతిలో ఏర్పాటైన ఈ నూతన సేవా కేంద్రం లో అధునాతన రీతిలో ధ్యాన మందిరం, భారత దేశ ప్రాచీన రాజ యోగ విశిష్టతను తెలియచేసే ప్రదర్శనా స్థానం, 140 మంది ఒకేసారి వీక్షించే ఆడియో విజువల్‌ రూమ్, ఆధ్యాత్మిక గ్రంథాలయం ప్రత్యేక ఆకర్షణలు. ప్రారంభోత్సవం తరువాత, నగరంలో బ్రహ్మకుమారీల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. బ్రహ్మకుమారీ కేంద్రాల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచాలకులు, హైదరాబాద్‌ నగర బ్రహ్మ కుమారీల ముఖ్య సంచాలకులు, పలువురు ప్రముఖులు, బ్రహ్మకుమారీల ముఖ్యకేంద్రమైన మౌంట్‌ అబు నుంచి రాజయోగి మృత్యుంజయ హంస బెన్‌ తదితర సభ్యులు ఉంటారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top