ప్రేమతో సంపూర్ణం

Review On Emi Macbride A Small Girl Farmed Things - Sakshi

కొత్త బంగారం  

‘నీ స్పర్శతో నేను ఈదగలను.’ అన్నయ్య ఉనికిని తల్లి గర్భం నుంచే ఊహించుకోగలిగిన కథకురాలి మాటలివి. తల్లికి మత పిచ్చి. తండ్రి వారిని వదిలిపోయి, ఆ తరువాత చనిపోతాడు. అన్న– మెదడు కణితిని చిన్నతనంలోనే తీసెయ్యడంతో బుర్ర సరిగ్గా పని చేయనివాడు. ఆ ఆపరేషన్‌ వల్ల చూపు, మాట, నడక మారి– నెత్తిమీద మచ్చ మిగుల్తుంది. ఇది ఎమియర్‌ మక్‌బ్రైడ్‌ రాసిన ‘ఎ గర్ల్‌ ఈజ్‌ ఎ హాఫ్‌ ఫార్మ్‌డ్‌ థింగ్‌’ నవల. యీ ఐరిష్‌ పుస్తకంలో, ఏ పాత్రకీ పేరుండదు. చైతన్య స్రవంతి శైలిలో సాగుతుంది.

ఆమె బాల్యం అస్తవ్యస్తంగా గడుస్తుంది. తల్లి కొడుకు పట్ల పక్షపాతం చూపించినప్పటికీ అది కథకురాలికి సమస్యగా మారదు. స్కూల్లో అన్నను ‘ఈ గొంతుకి మొద్దు నాలిక నచ్చుతుందా?’ అంటూ హేళన చేయడాన్ని చూసినప్పుడు, తనే బాధని అనుభవిస్తుంది. ఆమెకు 13 ఏళ్ళున్నప్పుడు, దూరపు బంధువైన ‘అంకుల్‌’ ఆమెను మానభంగం చేస్తాడు. ఆ నేరం గురించి మాట్లాడ్డానికి బదులు ఆమె దాన్ని సమర్థించేందుకు ప్రయత్నిస్తుంది. తన యీ కొత్త స్త్రీతనపు విశ్వాసాన్ని ఉపయోగించుకుంటూ, అన్నను హేళన చేసిన కుర్రాళ్ళతో కూడుతూ, తన తడాఖా చూపించుకుంటున్నానని భావిస్తుంది. ‘శాంతిగా నా పడవలోకి జారుకుంటూ, పాపాన్ని ఆహ్వానిస్తున్న దాన్ని’ అనుకుంటుంది.

ఇల్లు విడిచిపెట్టి కాలేజీలో చేరిన తరువాత, కొంతకాలం సామాన్యమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంది. అన్న తిరిగి క్యాన్సర్‌ బారిన పడినప్పుడు– దిశా రహితంగా అనామకులతో సహవాసం కలిపించుకుంటూ, ‘ప్రతీ ప్రశ్నకూ సమాధానం మైథునం’ అనే స్థితికి చేరుతుంది. తనని కొట్టి, హింసించే సంగమ చర్యలు ఆమెకి ఓదార్పు కలిగించడం ప్రారంభిస్తాయి. 

తన్ని తాను అసహ్యించుకోవడం వల్ల తనను అభిమానించే వాళ్ళంటే దూరం పారిపోతుంది. స్నేహాలను, ఓదార్పును, నవ్వును తిరస్కరిస్తుంది. కానీ ప్రేమను కాదు. కాకపోతే ఆమెకది దొరకదు. ఆమెకు 18 ఏళ్ళుండగా తాత చనిపోయినప్పుడు, ఇంటికి వస్తుంది. అన్న చనిపోయిన తరువాత ఆమె మామూలుగా అయిపోతుంది. అయితే, అంకుల్‌ ఆమెను వేధించడం మానడు. 

‘మంచివాడైన నీ అన్న ఇప్పుడు లేడు. ఇలా అనడాన్ని దేవుడు క్షమిస్తాడనుకుంటూనే చెప్తున్నాను, విను. ఆ శవపేటికలో ఉన్నది నీవే అయి ఉండాలనుకుంటున్నాను. నా కొడుకు కాదు’ అని తల్లి చెప్పినప్పుడు, నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది. 

కథకురాలి స్వీయ విధ్వంసక ప్రవర్తనని కనపరిచే యీ అంతులేని దుఃఖపు కథని పాఠకులు తట్టుకునేలా చేసేది– అన్న పట్ల బేషరతుగా కొనసాగే ఆమె ప్రేమే. సంపర్కం, ఆ ప్రవర్తనల క్లిష్ట లోకం గురించి పూర్తిగా అర్థం అవని ఒక పిల్ల మానభంగానికి గురయినప్పుడు– ఆ సంఘటన ఇంకా సగమే రూపొందిన ఆ అమ్మాయి మీద ఎంత భయంకరమైన ప్రభావం చూపుతుందో చెప్తుంది నవల. ఏకభాషణతోనే సాగే పుస్తకంలో విరామ చిహ్నాలు కనబడవు. పాత్రలు ఏ కాలానివో అన్న వివరాలుండవు. ఆమెకు ఐదేళ్ళున్నప్పుడు మాట్లాడిన సగంసగం వాక్యాలు, ఆమెకు 18 ఏళ్ళు వచ్చినప్పుడూ అలాగే ఉంటాయి. ఆ ఖాళీలను పాఠకులు తమ ఇష్ట ప్రకారం పూరించుకోవచ్చు. అయితే, కొన్ని పేజీలు దాటిన తరువాత ఆ భాష ఇంక తికమక పెట్టదు. సాంప్రదాయ విరుద్ధమైన యీ నవలను తొమ్మిదేళ్ళు ఎవరూ ప్రచురించే ధైర్యం చేయలేకపోయారు. ఆఖరికి, గాలీ బెగ్గర్‌ ప్రెస్, 2013లో వెయ్యి కాపీలు ప్రచురించిన తరువాత– గెలుచుకున్న అవార్డులు ఎన్నో, ప్రచురించడానికి ముందుకు వచ్చిన పబ్లిషింగ్‌ హౌసులూ అన్నే.
కృష్ణ వేణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top