
రచయిత కూడా ఒక శాస్త్రవేత్తలాగా సమాజంలోని పాత్రలను ఆద్యంతమూ పరిశీలించాలనే నేచురలిస్టు వాద రచయిత ఎమిలీ జోలా (1840–1902). ఎంతోమంది రచయితలను ప్రభావితం చేసిన 19వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత. ఇటాలియన్ తండ్రికీ, ఫ్రెంచ్ తల్లికీ జన్మించాడు. ఏడేళ్లప్పుడు తండ్రి చనిపోయాడు. చాలీచాలని డబ్బుతో తల్లి పోషించింది. ఒక్కోసారి వాలిన పిచ్చుకలను పట్టుకుని తిని బతికారంటారు. పాత్రికేయుడిగా మారకముందు గుమస్తాగా కూడా జోలా పనిచేశాడు. చిన్నతనం నుంచే రచన మీద ఆసక్తి ఉన్న జోలాకు పేరు వస్తున్నకొద్దీ డబ్బు ఒక సమస్య కాకుండా పోయింది.
వారసత్వం, పరిణామం ఒక కుటుంబంలోని ఒక్కో సభ్యుడిని ఎలా ప్రభావితం చేస్తాయో చిత్రించే ఆయన 20 సంపుటాల నవల, ‘లెస్ రౌగాన్ – మక్వార్ట్’. 1870లో ప్రారంభించి సుమారు ఏడాదికొకటి చొప్పున 1893 వరకు పూర్తి చేశాడు. తలచుకోవడానికే భయమేసే బృహత్తర ప్రయత్నం. ఇందులోని జెర్మినల్, ఎర్త్, ద కిల్, నానా భాగాలు విడిగానూ ప్రసిద్ధం.
‘డ్రెయ్‌ఫస్ ఎఫైర్’ పేరుతో పన్నెండేళ్లపాటు కొనసాగిన చరిత్రాత్మక కేసులో యూదు సైనికుడు డ్రెయ్‌ఫస్ వైపు నిలిచాడు జోలా. ఫ్రెంచ్ సమాజాన్ని రెండుగా చీల్చిన ఈ చర్య ఆయనను ఎందరికో శత్రువుగా చేసింది. అయినప్పటికీ ఫ్రాన్సులో యూదులపట్ల వ్యతిరేకత పోవడానికి క్రమంగా కారణమయ్యాడు. 1902లో ఇంట్లోనే విషవాయువు బారిన పడి ప్రమాదవశాత్తూ జోలా మరణించాడు. ఈ వాయువు లీక్ అవడానికి జోలా వ్యతిరేకులే కారణమని నమ్మినవాళ్లూ ఉన్నారు.