ఒక దీపం చాలదా? 

Girl will help to get married - Sakshi

చెట్టు నీడ 

ఒకరోజు ఒక పేదవాడు ప్రవక్త ముహమ్మద్‌ (స) వద్దకు వచ్చి, ‘‘అయ్యా! నేను పేదవాడిని. నా కూతురు పెళ్ళీడుకు వచ్చింది. దయచేసి నా కూతురు పెళ్లికి ఏదైనా సహాయం చేయండి’ అని అడిగాడు. ‘‘బాబూ! ప్రస్తుతం నీకు సహాయం చేయడానికి నా వద్ద ఏమీ లేవు. నువ్వు ఒక పని చేయి, ఫలానావ్యక్తి దగ్గరకు వెళ్ళు. మీ అమ్మాయి పెళ్ళికి అవసరమైన సహాయం చేస్తాడు’’ అని సలహా ఇచ్చారు. ఆ పేదవాడు ప్రవక్త ముహమ్మద్‌ (స) తెలిపిన వ్యక్తి దగ్గరకు వెళ్ళే సమయానికి సాయంత్రం అయింది. ఇంట్లో నుండి ‘‘రెండు దీపాలు వెలిగించావు, ఒక దీపం చాలదా’’ అని భార్యతో ఆ పెద్దమనిషి అంటున్న మాటలు విని, ‘ఇంత పిసినారి నాకేం సహాయం చేస్తాడు’ అని మళ్ళీ తిరిగి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి తాను విన్నది విన్నవించాడు. ప్రవక్త (స) మళ్ళీ ఆ వ్యక్తి వద్దకే వెళ్ళమన్నారు. అతడు తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తాను వచ్చిన విషయం విన్నవించాడు.

ఆ పెద్దమనిషి ఇతన్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేశాడు.  ఆ పెద్దాయన తాను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేయడాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ‘‘అయ్యా! ఇందాక మీరు రెండు దీపాలు వెలిగించినందుకు మీ భార్యను గద్దించారు. ఇప్పుడేమో నాకు నేను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేశారు’’ అని అన్నాడు.‘‘నేను ఇలా పొదుపు చేయడం వల్లేకదా నీలాంటి వారికి సహాయం చేయగలిగాను. కాసిన్ని పుణ్యాలు సంపాదించుకోగలిగాను’’ అని సమాధానం ఇచ్చాడు ఆ పెద్దాయన. ‘‘వ్యర్థమైన ఖర్చులు చేయకండి. వ్యర్థమైన ఖర్చులు చేసేవారు సైతాన్‌ సోదరులు. సైతాన్‌ మీ బద్ధశత్రువు’’ (17: 27) అని ఖురాన్‌లో అల్లాహ్‌ చేసే హితబోధను మనమంతా పాటించి శాశ్వతమైన స్వర్గం కోసం పుణ్యాలు సమకూర్చుకునే సద్బుద్ధి ప్రసాదించు గాక.
– షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top