డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

Dream Girl Hema Malini COmpleted 70 Years - Sakshi

నిజ జీవితంలోనూ నట జీవితంలోనూ హుందాగా ఉండవచ్చని, ఎనలేని కీర్తినీ గౌరవాన్ని పొందవచ్చని నిరూపించిన అతికొద్దిమంది భారతీయ నటీమణులలో హేమమాలిని ఒకరు. అక్టోబర్‌ 16కు ఆమె 70 ఏళ్లు పూర్తి చేసుకొని 71వ ఏటలోకి ప్రవేశిస్తున్నారు.

దేశంలో కుర్రకారు చాలామందిని తమ డ్రీమ్‌గ ర్ల్స్‌గా భావించవచ్చు. కాని ‘డ్రీమ్‌గర్ల్‌’ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఒక్కటే. హేమ మాలిని. దక్షిణాది నుంచి వెళ్లి హిట్‌ అయిన హీరోయిన్ల వరుసలో హేమమాలినిది సుదీర్ఘ కెరీర్‌. నిజానికి ఆమెకు హీరోయిన్‌ పాత్ర కూడా దక్షిణాది హీరోయిన్‌ వల్లే వచ్చింది. తమిళ, తెలుగు సినిమాల్లో డాన్స్‌ పాటలు చేసిన (పాండవ వనవాసం) హేమ మాలిని హిందీలో మొదటిసారి ‘సప్‌నోంకా సౌదాగర్‌’లో హీరోయిన్‌ అయారు. ఆ సినిమా హీరో అయిన రాజ్‌కపూర్‌ హేమమాలినికి స్క్రీన్‌ టెస్ట్‌ కోసం ‘సంగమ్‌’ సినిమాలోని ఒక సీన్‌ ఇచ్చి చేసి చూపమన్నాడు. ఆ టెస్ట్‌లో ఆమె పాస్‌ అయ్యారు. రాజ్‌ కపూర్‌ సినిమా ప్రమోషన్‌లో ఘనాపాటి కాబట్టి కొత్త హీరోయిన్‌నీ తద్వారా సినిమానీ ప్రమోట్‌ చేయడానికి హేమమాలినిని ‘బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌’గా ప్రచారం చేశాడు. అలా ఆమె డ్రీమ్‌గర్ల్‌గా ముద్రపడింది. ఎంతగా అంటే కొన్నాళ్ల తర్వాత అదే పేరుతో ఆమె హీరోయిన్‌గా సినిమా వచ్చేంత.

దక్షిణాది కథతో
తెలుగులో హిట్‌ అయిన ఎన్‌.టి.ఆర్‌ ‘రాముడు భీముడు’ కథనే హీరోయిన్‌కు రాసి సలీమ్‌ జావేద్‌ ఆ స్క్రిప్ట్‌ను రమేష్‌ సిప్పీకి అమ్మితే రమేష్‌ సిప్పీ హేమ మాలిని డబుల్‌ యాక్షన్‌తో ఆ సినిమా తీసి హిట్‌ కొట్టాడు. అలాగే మన తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా ‘ప్రేమ్‌నగర్‌’ హిందీలో రీమేక్‌ అవుతున్నప్పుడు రాజేష్‌ ఖన్నా సరసన హీరోయిన్‌ పాత్ర హేమ మాలినికి దక్కింది. తెలుగులో వాణిశ్రీ గొప్పగా చేసిన ఆ పాత్రను హేమ మాలిని హిందీలో నిలబెట్టారు. ఆ తర్వాత వచ్చిన ‘షోలే’తో హేమ మాలిని పూర్తి స్థాయి స్టార్‌డమ్‌కు చేరుకున్నారు.

ముగ్గురు హీరోలతో
హేమ మాలిని ఎక్కువగా దేవ్‌ ఆనంద్, రాజేష్‌ ఖన్నా, ధర్మేంద్ర సరసన నటించారు. ‘జానీ మేరా నామ్‌’,‘అందాజ్‌’, ‘నసీబ్‌’, ‘క్రాంతి’, ‘సత్తే పే సత్తా’, ‘అంధా కానూన్‌’ వంటి ఎన్నో హిట్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి. గ్లామర్‌ హీరోయిన్‌గా ఉన్నప్పటికీ ‘ఏక్‌ చాదర్‌ మైలీసీ’ వంటి బలమైన కథాంశం ఉన్న సినిమాలలో నటించి ఆమె పేరు తెచ్చుకున్నారు. హేమ మాలిని తన స్టార్‌ డమ్‌ను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. కొత్త తరం ఎంత వచ్చినప్పటికీ వారితో సమానంగా అమితాబ్‌ సరసన ‘బాగ్‌బన్‌’లో నటించి ఆ సినిమా విజయానికి కారకులయ్యారు.

జబ్‌ తక్‌ హై జాన్‌
హేమ మాలిని క్లాసికల్‌ డాన్సర్‌. బాల్యం నుంచే ప్రదర్శనలు ఇచ్చారు. అందువల్ల ‘షోలే’ సినిమా క్లయిమాక్స్‌లో గబ్బర్‌ సింగ్‌ ముందు ఆమె డాన్స్‌ చేసే పాట ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ చాలా హిట్‌ అయ్యింది. ఎండలో బండ రాళ్ల మీద ఆమె గొప్ప నర్తనం చూపారు. కాళ్ల కింద గాజుపెంకులు వేస్తే డాన్స్‌ చేయడం ఆ తర్వాత పదుల సినిమాలో కాపీ అయ్యింది. మన శ్రీను వైట్ల కామెడీ కోసం కూడా ఈ గాజుపెంకుల డాన్స్‌ను ఉపయోగించుకున్నారు.

ప్రేమ కథ
హేమ మాలినిని వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారు. వారిలో సంజీవ్‌ కుమార్‌ ఒకడు. ఆ తర్వాత జితేంద్ర ఆ ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరు మద్రాసులో వివాహం చేసుకోవడానికి దాదాపు తేదీ ఖరారు చేశారు. అయితే అప్పటికే ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్న ధర్మేంద్ర ఆ పెళ్లి ఆపించి ఆమె తన భార్య అయ్యేలా సఫలం అయ్యాడు. ధర్మేంద్రకు రెండో భార్యగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇద్దరూ ఆ బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా విమర్శలకు దిగలేదు. ధర్మేంద్ర మొదటిభార్య కుటుంబం హేమ మాలిని నుంచి ధర్మేంద్రను మెల్లగా దూరం చేయడంలో సఫలం అయ్యిందనే చెప్పాలి. వారిరువురూ కలిసి ప్రయివేట్‌గా కనిపించడం అరుదు.

భిన్న రంగాల్లో
హేమ మాలిని రాజకీయాల్లో ఉన్నారు. మధుర పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 2014లో 2019లో విజయం సాధించారు. దూరదర్శన్‌లో ‘నుపుర్‌’ సీరియర్‌ నిర్మించి, దర్శకత్వం వహించారు. కుమార్తె ఇషాను హీరోయిన్‌ చేయడానికి సినిమాలు నిర్మించారు. సినిమాలలో ఉన్నా రాజకీయాలలో ఉన్నా నాట్యం పట్ల ఉన్న మక్కువతో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు.
సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top