సరదాగా పాడింది...స్టార్ సింగర్ అయింది! | Chandralekha a House wife from Kerala becomes star singer | Sakshi
Sakshi News home page

సరదాగా పాడింది...స్టార్ సింగర్ అయింది!

Oct 25 2013 11:52 PM | Updated on Sep 1 2017 11:58 PM

నాలుగు రోజుల్లో ఎనిమిది లక్షల యూట్యూబ్ ‘వ్యూ’స్! అది ఏ స్టార్ హీరో సినిమా టీజరో కాదు. సంచలనాత్మకమైన వీడియో అసలే కాదు.

నాలుగు రోజుల్లో ఎనిమిది లక్షల యూట్యూబ్ ‘వ్యూ’స్! అది ఏ స్టార్ హీరో సినిమా టీజరో కాదు. సంచలనాత్మకమైన వీడియో అసలే కాదు. ఒక సాధారణ గృహిణి పాడిన పాట. ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ ఆఫ్ ది చార్ట్‌గా నిలుస్తోంది. ఆమెకు గొప్ప సింగర్‌గా గుర్తింపును తెచ్చిపెడుతోంది. అంతేకాదు, సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఆమె పేరు చంద్రలేఖ. వయసు 33. పెళ్లైంది, పిల్లలు కూడా.

కేరళలోని పథనమ్‌తిట్ట జిల్లా అదూర్‌కు సమీపంలోని పరక్కొడ్ గ్రామం. అక్కడి ఒక వ్యవసాయాధార కుటుంబానికి చెందిన చంద్రలేఖ చక్కగా పాడతారు కూడా. అయితే ఆ గాత్రానికి ఇన్నాళ్లుగా భర్త, చుట్టుపక్కల వాళ్ల మెచ్చుకోళ్లు తప్ప మరేమీ లేవు. ఈ నేపథ్యంలో జరిగిన చిన్న పరిణామం ఆమె గురించి దేశం మొత్తానికి తెలియజేసింది. దగ్గరి బంధువు అయిన దర్శన్ అనే వ్యక్తి చంద్రలేఖతో ఒక పాట పాడించి దాన్ని వీడియో రూపంలో యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశాడు.

అంతే... చంద్రలేఖ జీవితం మలుపు తిరిగింది. ప్రసిద్ధగాయని చిత్ర పాడిన ఒక మలయాళ పాటను ఆ లెజెండరీ గాయనికి దీటుగా చంద్రలేఖ పాడారు. దాన్ని యూట్యూబ్‌లో చూసిన వాళ్లంతా అద్భుతమంటూ ప్రశంసించారు. వీడియోను చూసిన దర్శకుడు శిబి మలయాళీ, సంగీత దర్శకుడు మిలన్ జలీల్‌లైతే తమ సినిమా ‘లవ్‌స్టోరీ’తో చంద్రలేఖను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు!
 
ఈ సందర్భంగా వారు చంద్రలేఖ శ్రావ్యమైన గాత్రంతో ఒకటిన్నర నిమిషం ఉండే చిన్న బిట్‌ను విడుదల చేశారు. అదే ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దాన్ని వింటూ అనేకమంది చంద్రలేఖకు ఫ్యాన్స్‌గా మారుతున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న యువ గాయనీ గాయకుల జాబితాను పరిశీలిస్తే వాళ్లందరూ ఏ ఇండియన్ ఐడల్ విజేతలో, జీ సారెగమ ఛాంపియన్‌లో అయ్యుంటారు. ఆ రియాలిటీ షోలలో వచ్చిన గుర్తింపు వారిని సులభంగా సినిమా సింగర్లను చేసేస్తోంది. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సాధారణ గృహిణి సినీగాయనిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషమే కదా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement