ఎత్తయిన సిగ్గరి

Article On Richard Brautigan In Sakshi

గ్రేట్‌ రైటర్‌ (రిచర్డ్‌ బ్రాటిగన్‌)  

ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉండేవాడు రిచర్డ్‌ బ్రాటిగన్‌ (1935–1984). ఈ అమెరికా రచయిత రాసే అక్షరాలు మాత్రం చీమల్లా ఉండేవి. ఈ వైరుధ్యం ఆయన జీవితమంతా కొనసాగింది. డబ్బులున్నప్పుడు విలాసంగా బతికాడు, లేనప్పుడు బిచ్చగాడిలా ఉండటానికీ సిద్ధపడ్డాడు. తన ఎత్తుకు నప్పని సిగ్గరి కూడా. ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, ఓ వెయిట్రెస్‌ సంతానం రిచర్డ్‌. ఇంకా రిచర్డ్‌ కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రెవరో తెలియకుండానే పెరిగాడు. తర్వాత కూడా తల్లి ఒక స్థిరమైన బంధంలో కుదురుకోలేదు. దీనికి తోడు పేదరికం. ఈ బాల్య జీవితపు నిరాదరణ బ్రాటిగన్‌ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసేవాడు. వ్యక్తిగత సంరక్షణ మీద దృష్టి ఉండకపోయేది. జైల్లో పడితేనైనా కడుపు నిండా తినొచ్చన్న ఆలోచనతో ఓసారి పోలీస్‌ స్టేషన్‌ కిటికీ మీదికి రాయి విసిరాడు. పోలీసులు పట్టుకుని, తీవ్రమైన వ్యాకులత, మనోవైకల్యంతో బాధ పడుతున్న అతడికి వైద్యం చేయించారు.

గొప్పవాడిలా కనబడాలని మార్క్‌ ట్వెయిన్‌లా మీసాలు పెంచుకున్న బ్రాటిగన్‌లో నిజంగానే చిన్నతనం నుంచే గొప్పతనం ఉంది. పన్నెండేళ్లప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించాడు. వీధుల్లో, పొయెట్రీ క్లబ్బుల్లో తన కవిత్వం చదివేవాడు. వామపక్ష భావజాలంతో నడిచే వీధి నాటకాల సంఘం ‘ద డిగ్గర్స్‌’ కోసం రాసేవాడు. అప్పుడు రాసిన ‘ట్రాట్‌ ఫిషింగ్‌ ఇన్‌ అమెరికా’(1967) లక్షల కాపీలు అమ్ముడుపోయింది. 1960, 70ల నాటి అమెరికా ప్రభుత్వ వ్యతిరేక దశకు ఈ నవల అద్దం పట్టింది. రాత్రుళ్లు రాసి పగలు పడుకునే బ్రాటిగన్‌ కథల సంపుటితో పాటు ‘ఎ కాన్ఫెడెరేట్‌ జనరల్‌ ఫ్రమ్‌ బిగ్‌ సుర్‌’, ‘ఇన్‌ వాటర్‌మెలన్‌ షుగర్‌’, ‘సో ద విండ్‌ వోంట్‌ బ్లో ఇట్‌ ఆల్‌ అవే’ లాంటి నవలలు వెలువరించాడు. జపాన్‌లో కూడా  విపరీతమైన పేరు వచ్చింది. అయితే, ఉద్యమం వెనుకబాట పట్టిన తర్వాత బ్రాటిగన్‌ ఆదరణ కోల్పోయాడు. మద్యపానానికి బానిస కావడం, నిరంతర వ్యాకులత ఆయన్ని కూడా తల్లిలాగే ఏ ఒక్క వైవాహిక బంధంలోనూ, మొత్తంగా జీవితంలోనూ సౌకర్యంగా ఇమిడిపోనివ్వలేదు. దానికోసం ఆయన ప్రయత్నించినట్టు కూడా కనబడదు.

నడకను తప్ప వ్యాయామాన్ని ఇష్టపడేవాడు కాదు. అద్దంలో చూసుకోవడమంటే పిచ్చి. అప్పులు చెల్లించడంలో సోమరి. ఒక దశలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బ్రాటిగన్‌ తన 49 ఏళ్ల వయసులో రివాల్వర్‌తో తలలోకి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం కుళ్లిన కొద్ది రోజుల తర్వాతగానీ ఆయన చనిపోయిన వార్త ప్రపంచానికి తెలియలేదు. ఆయన వదిలివెళ్లిన ఆత్మకథాత్మక, వ్యంగ్యపూరిత అక్షరాల గంధం మాత్రం తర్వాత చాలామంది రచయితల కలాలకు సోకింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top