పావని మోసాలు ఎన్నని..! | women complaint against pavani to chittoor sp | Sakshi
Sakshi News home page

పావని మోసాలు ఎన్నని..!

Jan 6 2016 10:44 AM | Updated on Aug 13 2018 3:25 PM

పావని మోసాలు ఎన్నని..! - Sakshi

పావని మోసాలు ఎన్నని..!

జిల్లాలో పలువురి మహిళల్ని మోసం చేసి, వారి బంగారు ఆభరణాలను ఫైనాన్స్ కంపెనీల్లో కుదువపెట్టి, అందరికీ కుచ్చుటోపీ పెట్టిన పావని మోసాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.

‘సాక్షి’ కథనంతో ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.15 లక్షల ఆభరణాలు  ఇచ్చినట్లు వెల్లడి
తన భర్త మృతికి పావని కారణమని మరో మహిళ ఫిర్యాదు
నిందితురాలికి అండగా నిలిచిన పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశం


చిత్తూరు (అర్బన్): జిల్లాలో పలువురి మహిళల్ని మోసం చేసి, వారి బంగారు ఆభరణాలను ఫైనాన్స్ కంపెనీల్లో కుదువపెట్టి, అందరికీ కుచ్చుటోపీ పెట్టిన పావని మోసాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. పావని చేసిన మోసాలపై ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఖతర్నాక్ పావని’ శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. పలువురు బాధితులు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను పోలీసు మైదానంలో కలిసి  తమ గోడు నివేదించారు.

ఎందరో బాధితులు

చిత్తూరుకు చెందిన జ్యోత్స్న పావనిపై పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పలువురు బాధితులు ముందుకొచ్చారు. వీళ్లల్లో నగరంలోని మార్కెట్‌వీధికి చెందిన వాణి అనే మహిళ ఎస్పీకు తన గోడు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. తన ఆభరణాలు పావనికి ఇచ్చినా ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో తన భర్త ఆదినారాయణగుప్త ఆమెను నిలదీయడానికి వెళ్లి గత ఏడాది ఏప్రిల్ 30న తవణంపల్లెలో శవమయ్యాడని, దీనిని పావని దంపతులే కారణమని పేర్కొంది. మరో మహిళ మాట్లాడుతూ, పావని మాటలు నమ్మి బంగారు ఆభరణాలు, రూ.లక్షల్లో డబ్బులిచ్చి మోసపోయామని చెప్పుకొచ్చింది. మరో వృద్ధురాలు మాట్లాడుతూ, ఇచ్చిన ఆభరణాలు అడిగినందుకు చింటూ వద్ద పావని తమను దోషిగా నిలబెట్టిందని మొగిలి, హరిదాస్, పరంధామలకు సైతం ఇందులో సంబంధం ఉందని పేర్కొన్నారు.  పావని వ్యవహారంలో పోలీసు శాఖకు చెందిన కొందరు ఆమెకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారని మరో బాధితురాలు ఆరోపించింది. తాము పావని మాటల్లో పడి రూ.15 లక్షలు, రూ.20 లక్షలు, రూ. 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇచ్చి ఇప్పటి వరకు వాటిని తీసుకోలేదని మరికొందరు ఎస్పీ వద్ద లబోదిబోమన్నారు.

అందరి గోడూ ఆలకించిన ఎస్పీ దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చిత్తూరు మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా ఇందులో ప్రమేయమున్న పోలీసులపై సైతం కేసు నమోదు చేయాలన్నారు. దీంతో మహిళల నుంచి వేర్వేరుగా ఫిర్యాదులు తీసుకున్న డీఎస్పీ, వాళ్ల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పావనికి బంగారు ఆభరణాలు ఇచ్చిన వాళ్లంతా అధిక వడ్డీకు ఆశపడి ఇంట్లో భర్త, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా మోసపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూడటం కొసమెరుపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement