Sakshi News home page

మారిన మావోయిస్టుల పంథా

Published Sat, Jun 25 2016 8:20 AM

మారిన మావోయిస్టుల పంథా - Sakshi

పార్వతీపురం: చేతిలో తుపాకీ... నెత్తిన టోపీ... కాళ్లకు బూట్లు... యూనిఫామ్‌తో ఒకప్పుడు కనిపించిన మావోయిస్టులు వారి పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. జనం కోసం... వారిలో ఒకరిగా కలసిపోయి సమస్యలపై పోరాడేందుకు... గిరిజన సంప్రదాయ దుస్తులు... వారి అలంకరణతో కలసిపోయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల మావోయిస్టుల అలికిడి ఉన్నట్లు సమాచారం. వీరు ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించేందుకు... గిరిజనుల బతుకులు బాగుచేస్తామంటూ వారికి దగ్గరవుతున్నట్లు సమాచారం.
 
విస్తృతంగా సమావేశాలు
వారి కొత్త వ్యూహంలో భాగంగా ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. ఆయా గ్రామాల్లోని గిరిజనులను గ్రూపులుగా తయారు చేసి, వారి ద్వారానే సమస్యలు వివరింపజేసి... తామెలా దోపిడీకి గురవుతోందీ తెలియజేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల వైఫల్యాలను ఎదిరించడంపై వారికి శిక్షణనిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గిరిజనులు సారాకు బానిసవుతున్న విషయాన్ని గుర్తించి, తయారు చేస్తున్న వారిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తయారీ నియంత్రణకు చురుగ్గా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఓబీలో సారా తయారు చేస్తున్నవారిని హెచ్చరించినట్లు సమాచారం.

మౌలిక సదుపాయాలపై విప్పుతున్న గళం
గిరిజన గ్రామాలకు, గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించలేని అధికారులు, పాలకుల అసమర్ధత, నిర్లక్ష్యంపైనా ప్రశ్నించేలా గిరిజనులను చైతన్య పరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచం మినరల్ వాటర్‌వైపు పరుగులిడుతున్న తరుణంలో గిరిజనులు కనీసం గుక్కెడు మంచినీటికి నోచుకోకపోవడంపై మావోయిస్టులు వారిని చైతన్యపరుస్తున్నారు. ఏఓబీలో మరలా పట్టు సాధించేందుకు గట్టి కృషి చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement