బది’లీలలు’ | transfers in govt employees | Sakshi
Sakshi News home page

బది’లీలలు’

Jul 5 2016 9:39 AM | Updated on Aug 14 2018 3:48 PM

‘రాజకీయ సిఫార్సులకు తావుండదు. బదిలీలన్నీ పారదర్శకంగా చేపడతాం. పైరవీలకు అస్సలు చోటుండదు..’

  • డ్వామాలో 15 రోజుల క్రితం 55 మంది బదిలీ
  •  ఇప్పటికి రిలీవైంది 15 మందే!
  •  పాత స్థానాల్లోనే కొనసాగేందుకు ఎత్తుగడ
  •  ఎంపీడీఓలపై రాజకీయ ఒత్తిడి
  •  
    ‘రాజకీయ సిఫార్సులకు తావుండదు. బదిలీలన్నీ పారదర్శకంగా చేపడతాం. పైరవీలకు అస్సలు చోటుండదు..’ -ఇవీ బదిలీలకు ముందు ఉన్నతాధికారులు  చెప్పిన మాటలు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో జరిగిన బదిలీలే ఇందుకు నిదర్శనం. గత నెల 20న సాక్షాత్త్తు కలెక్టర్ కోన శశిధర్ సమక్షంలో బదిలీల కౌన్సెలింగ్  నిర్వహించారు. సంస్థ పరిధిలో ఐదేళ్ల పాటు ఒకేచోట విధులు నిర్వర్తించిన 48 మందిని, మూడేళ్ల పాటు ఉన్న ఏడుగురిని బదిలీ చేశారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితి మారిపోతోంది.
     
    అనంతపురం టౌన్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో  బదిలీ అయిన సిబ్బందిలో చాలామంది రిలీవ్ కావడం లేదు. పాత స్థానాల్లోనే కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీ అయిన వారిలో 39 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 13 మంది టెక్నికల్ ఆఫీసర్లు, ఇద్దరు ఈసీలు, 13 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.

    ప్రక్రియ ముగిసి 15 రోజులైనా వీరిలో 15 మంది మాత్రమే బదిలీ అయిన ప్రాంతంలో చేరినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా ఉన్న ఎంపీడీఓలపై కొందరు రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే బదిలీ అయిన వారు ఎంపీడీఓల నుంచే రిలీవ్ ఆర్డర్లు తీసుకోవాల్సి ఉంటుంది.  ప్రధానంగా టెక్నికల్ అసిస్టెంట్లు కుర్చీలు వదలడానికి ఆసక్తి చూపడం లేదు. ఎం.బుక్కులు, కొలతల వివరాలు సెటిల్ చేయడంలో ఎడతెగని జాప్యం చేస్తున్నారు.
     
    రిలీవ్ కావడానికి ఒకవైపు వీటిని సాకుగా చూపుతూ..మరోవైపు అక్కడే ఉండడం కోసం నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ జరిగినప్పటి నుంచి రోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి ఉద్యోగులు డ్వామా ఉన్నతాధికారులను కలుస్తుండడమే ఇందుకు నిదర్శనం. కొందరిని ఎంపీడీఓలే సిఫార్సు చేస్తుండగా.. మరికొందరు రాజకీయ నేతల నుంచి లేఖలు తీసుకొస్తున్నారు.

    గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరి బదిలీలను నిలిపివేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సూచన మేరకు ఓ టెక్నికల్ అసిస్టెంట్ ప్రస్తుతమున్న స్థానంలోనే విధులు నిర్వర్తించుకునేలా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
     
    ఈ విషయం తెలుసుకున్న మిగిలిన టెక్నికల్ అసిస్టెంట్లు కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. మండల స్థాయి టీడీపీ నేతలతో ముఖ్య ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేయించి తమ స్థానం పదిలంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఏదిఏమైనా ఏళ్ల తరబడి ఒకే స్థానంలో పాతుకుపోయిన వారిని బదిలీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు చివరికి సీన్ రివర్స్ అవుతుండటంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని అదే శాఖలో పని చేస్తున్న కొందరు సిబ్బంది కోరుతుండడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement