శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏడాది | Shesachalam encounter to the year | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏడాది

Apr 7 2016 7:38 AM | Updated on Nov 6 2018 4:42 PM

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శేషాచలం ఎన్‌కౌంటర్ జరిగి నేటికి ఏడాదయ్యింది.

శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏడాది
ఇంకా పూర్తికాని సిట్ దర్యాప్తు
20 మంది ఎర్రకూలీలు బలైనా ఆగని ఎర్రదందా
ఎన్‌కౌంటర్  జరిగిన   ప్రాంతంలో పలుమార్లు గర్జించిన తుపాకులు

 

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శేషాచలం ఎన్‌కౌంటర్ జరిగి నేటికి ఏడాదయ్యింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అడ్డుకున్న తమపై రాళ్లు, కత్తులతో దాడి చేశారనే కారణంతో.. తమిళనాడుకు చెందిన 20మంది కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే పౌరహక్కుల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, తమిళనాడు ప్రజలు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ఆక్రోశించారు. మానవ హక్కుల కమిషన్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్వారా స్టే తెప్పించుకుని కేసును సిట్‌కు అప్పగించింది. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత ఏడాదికాలంలో జిల్లా నుంచి దాదాపు 40 టన్నుల మేరకు ఎర్రచందనం శేషాచలం సరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది.  సాక్షి ప్రతినిధి తిరుపతి: సరిగ్గా ఏడాది  క్రితం (2015 ఏప్రిల్ 7న) జిల్లాలోని శేషాచలం కొండలు పోలీసుల తుపాకుల మోతతో దద్దరిల్లాయి. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలోని శేషాచల అడవులు రక్తమోడాయి. పొట్టకూటికోసం తమిళనాడు నుంచి వచ్చిన ఎర్రకూలీలు 20 మందిలో సచ్చినోడి బండ వద్ద 11 మంది, చీకటీగలకోనలో 9 మంది ఎన్‌కౌంటర్‌కు బలయ్యారు. ఏడాది కాలంలో కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనపై ప్రభుత్వానికి ముందే తెలుసనీ, పథకం ప్రకారమే బూటకపు ఎన్‌కౌంటర్ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. ఎదురు కాల్పులు కాదు.. పోలీసుల ఏకపక్ష కాల్పులు అనే విమర్శలూ వచ్చాయి. జనారణ్యం నుంచి కూలీలను పోలీసులే పట్టుకెళ్లి బలి చేశారని.. ప్రజా సంఘాలు, పార్టీలు, మానవహక్కుల కమిషన్, హైకోర్టు సీరియస్ అయ్యింది. చివరకు సిట్‌తో దర్యాప్తుకు ఆదేశించింది. అయితే నివేదికను మాత్రం సిట్ బృందం ఇంకా సమర్పించలేదు.

 

ఎన్‌కౌంటర్‌పై తీరని అనుమానాలెన్నో..

మృతుల్లో ఏడుగురిని ముందురోజు పుత్తూరు సమీపంలో బస్సులో ప్రయాణిస్తుడంగా అదుపులోకి తీసుకొని శేషచలం అడవిలోకి తెచ్చి కాల్చి చంపారంటూ పోలీసుల నుంచి తప్పించుకొన్న ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. దుంగలు మోస్తున్న వారు దాడులు ఎలా చేస్తారు? కాల్పులు జరుపుతున్నా పారిపోకుండా ఉంటారా? వందలాదిమంది కూలీలు పోలీసులపై దాడిచేస్తే ఒక కూలీని కూడా ఎందుకు పట్టుకోలేక పోయారు? అనే అశాలు మిస్టరీగా మిగిలిపోయాయి.


ప్రజాసంఘాలు రంగంలోకి..
ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతాన్ని పలు ప్రజాసంఘాలు, మానవహక్కుల కమిషన్ సభ్యులు సందర్శించారు. ఎన్‌కౌంటర్ అనే అనుమానంతో పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో రిట్ వేశారు. చనిపోయిన ఎర్రకూలీల మృతదేహాలను రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని కోరారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విన్నవించారు. 302 సెక్షన్ కింద పోలీసులపై కేసు నమోదుచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే బాధితులు ముందుకు వస్తే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌కౌంటర్ ఘటనలో చనిపోయిన శశికుమార్ భార్య మునిఅమ్మాల్ ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

 

చంద్రబాబుపై ఆగ్రహం...
తమిళనాడుకు చెందిన అమాయక కూలీలను పొట్టన పెట్టుకున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనకారులు  పలుచోట్ల బాబు దిష్టి బొమ్మలను, చిత్ర పటాలను దహనంచేశారు. దుకాణాలపై దాడులు చేశారు. ఏపీ బస్సులు తమిళనాడులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చురగిల్చారు.

 
ఆగని దందా..

అసలు స్మగ్లర్లను వదలి అమాయక కూలీలను మట్టుపెట్టినా ఎర్ర దందా మాత్రం ఆగలేదు. సచ్చినోడి బండ, చీగటీగలకోన ప్రాంతంలో ఎన్‌కౌంటర్ తరువాత ఆరు, ఏడుసార్లు పోలీసులు కాల్పులు జరపడం ఎర్రకూలీలు పారిపోవడం దుంగలు దొరకడం నిత్యకృత్యంగా మారింది.

 

కేసును నీరుగార్చేందుకు..
హైకోర్టు  సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందనే నిర్ణయంతో ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసిన కేసును ప్రభుత్వం నీరుగార్చే యత్నం చేసింది. సిట్ దర్యాప్తు డీఐజీ రవిశంకర్  నేతృత్వంలో ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. అయితే ఇప్పటికీ ఏడాది గడిచినా చార్జ్ షీట్ కూడా దాఖాలు చేయలేదు.  దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే కేసుకు సంబంధించి పలువురు సాక్ష్యులను విచారించింది.

 

దోషులపై చర్యలేవీ?
సంఘటనకు బాధ్యులైన దోషులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. సిట్ దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. దోషులను పట్టుకోవడం బదులు వారిని కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కేసును నీరుగార్చే యత్నం చేస్తోంది.     - క్రాంతి చైతన్య, పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement