కవలల కోసం గాలింపు | Sakshi
Sakshi News home page

కవలల కోసం గాలింపు

Published Thu, Sep 14 2017 9:16 AM

నడుచుకుంటూ వెళ్తున్న ప్రకాశ్, మురళి (సీసీ కెమెరా దృశ్యం) - Sakshi

వడ్డెమాను బ్రిడ్జి వరకు పోలీసు గస్తీ  
కేసీ కెనాల్‌కు వచ్చినట్లు సీసీ ఫుటేజీ లభ్యం  


కర్నూలు :  నగరంలోని సప్తగిరినగర్‌కు చెందిన కవలలు ప్రకాష్, మురళి(12) ఆచూకీ కోసం బుధవారం కూడా గాలింపు కొనసాగింది.   ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లే ఆర్చి వైపు నుంచి రోడ్డు దాటి వినాయక ఘాట్‌ గుడి వెనుకవైపునకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. దీంతో కెనాల్‌లో మునిగి గల్లంతై ఉంటారన్న అనుమానం మరింత బలపడింది. ఎస్పీ గోపీనాథ్‌ జట్టి ఆదేశాల మేరకు స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ నరేంద్రనాథ్‌ రెడ్డి, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లుతో పాటు మరో నలుగురు స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లతో రెండు బృందాలుగా ఏర్పడి కెసీ కెనాల్‌ వెంట రెండు వైపులా ముమ్మరంగా గాలిస్తున్నారు.

జూపాడుబంగ్లా వరకు వెతికినా జాడ కనిపించలేదు. అల్లూరు వడ్డెమాను దగ్గర కేసీ కెనాల్‌పై ఉన్న బ్రిడ్జి వద్ద కొన్ని కళేబరాలు బ్లాక్‌ అయివున్నట్లు అక్కడ ఉన్న లస్కర్లు గుర్తించారు. చిన్నారుల మృతదేహాలు కూడా అక్కడే ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నీటి ఉధృతి తగ్గినందున గురువారం క్రేన్‌ సాయంతో చెత్తాచెదారాన్ని తొలగించి చిన్నారుల మృతదేహాల కోసం గాలించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు మోనేశా ఆచారి, పద్మావతిలు నిద్రాహారాలు మాని కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
Advertisement