'సింగపూర్ కాదు ఎలుకలు లేని ఆస్పత్రి చాలు' | parthasarathi fires on tdp government | Sakshi
Sakshi News home page

'సింగపూర్ కాదు ఎలుకలు లేని ఆస్పత్రి చాలు'

Aug 30 2015 9:44 PM | Updated on Sep 3 2017 8:25 AM

'సింగపూర్ కాదు ఎలుకలు లేని ఆస్పత్రి చాలు'

'సింగపూర్ కాదు ఎలుకలు లేని ఆస్పత్రి చాలు'

సింగపూర్ లాంటి రాజధాని తమకు అవసరం లేదని, ఎలుకలు లేని ఆసుపత్రిని నిర్మిస్తే చాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

గుంటూరు: సింగపూర్ లాంటి రాజధాని తమకు అవసరం లేదని, ఎలుకలు లేని ఆసుపత్రిని నిర్మిస్తే చాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్‌సీపీ కమిటీ ఆదివారం విచారణ జరిపింది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, వంగవీటి రాధాకృష్ణ, డాక్టర్ నన్నపనేని సుధా, డాక్టర్ జగన్‌మోహన్‌రావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు గుంటూరు జీజీహెచ్‌లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.

ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్‌ను సంఘటన గురించి ప్రశ్నించగా.. తాను తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టానని, తనకేమీ తెలియదని చెప్పారు. మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన వార్డును కమిటీ సభ్యులు సందర్శించారు. మూషికాల దాడిలో శిశువు మృతిపై పూర్తి నివేదికను వైఎస్ జగన్‌కు అందిస్తామని, ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అరుదైన ఆపరేషన్‌లు నిర్వహించిన ఘన చరిత్ర కలిగిన గుంటూరు జీజీహెచ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం శోచనీయమని కొలుసు పార్థసారధి అన్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలుకల దాడిలో శిశువు మృతి చెందడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, పలు విభాగాల కన్వీనర్‌లు కావటి మనోహర్‌నాయుడు, కొత్తా చిన్నపురెడ్డి, సయ్యద్ మాబు, సునీల్, మొగిలి మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement