ఆస్పత్రుల్లో నర్సులంటే మానవీయతకు చిహ్నం. అందుకే వారిని ఆప్యాయంగా, గౌరవంగా సిస్టర్ అని సంబోధిస్తారు
♦ కాన్పు సమయంలో గర్భిణిని తిట్టిన వైనం
♦ వైద్యం అందక శిశువు మృతి..బంధువుల ఆందోళన
మహబూబ్‌నగర్ క్రైం: ఆస్పత్రుల్లో నర్సులంటే మానవీయతకు చిహ్నం. అందుకే వారిని ఆప్యాయంగా, గౌరవంగా సిస్టర్ అని సంబోధిస్తారు. అలాంటి సిస్టర్లు తామూ మహిళలమే అన్న విషయం మరిచి పోయి మరో మహిళతో కర్కశంగా ప్రవర్తించారు. నిండుగర్భిణిని దుర్భాషలాడి, ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. సకాలంలో వైద్యం అందక ఆది వారం శిశువు మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ మండలం తిమ్మాసనిపల్లికి చెందిన స్వప్న శనివారం సాయంత్రం ప్రసవం కోసం జిల్లాసుపత్రికి వచ్చింది. ఆమెను ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోలేదు. స్వప్నకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో ప్రసూతి గదిలోకి వెళ్లింది.
‘నొప్పులు వస్తున్నాయి.. ప్రసవం చేయండి’ అని సిస్టర్లకు విన్నవించినా స్పందించకుండా గదిలో ఉన్న టీవీ చూస్తూ కూర్చున్నారు. నొప్పులు ఎక్కువ కావడంతో స్వప్న అక్కడే ఉన్న బెంచ్‌పై పడుకుంది. డెలివరీ అవుతున్న సమయంలో దర్భాషలాడడం మొదలుపెట్టారు. చేయి కూడా చేసుకున్నారు. వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. పుట్టిన మగ శిశువు మృతి చెందింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబసభ్యులు ప్రసూతి గది ఎదుట ఆందోళన చేశారు. సిస్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎంవో రాంబాబు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
బాధ్యులపై చర్యలు
ఆస్పత్రిలో సిస్టర్ల చర్యలు బాధాకరం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇక్కడి ఆస్పత్రిలో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. ఇకముందు ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదు.
- రాంబాబు, ఆర్‌ఎంఓ, మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి