ఓ ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కదిరి టౌన్ : ఓ ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కదిరికి కిలోమీటర్ దూరంలో గురువారం జరిగింది. పోలీసులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... కదిరి రూరల్ మండలం కె.బత్తలపల్లి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో కె.బత్తలపల్లికి చెందిన వెంకటరమణప్ప, ఆదిలక్ష్మీ, పుల్లయ్య, నడింపల్లికి చెందిన పుల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారందరినీ కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో వెంకటరమణప్ప పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అతన్ని అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే..
గట్ల నుంచి కదిరి వైపు పల్లం రోడ్డు కావడంతో ఆటో డ్రైవరు డీజిల్ ఆదా కోసం కక్కుర్తిపడి న్యూట్రల్ చేశాడు. కొంత దూరం రాగానే సడన్ బ్రేక్ వేయడంతో వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఆటో అదుపు తప్పి నడి రోడ్డుపై బోల్తా పడిందని బాధితులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.