తిరునాళ్లకని వెళ్లి శవమయ్యాడు!

young man suicide suspicious - Sakshi

అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకున్న యువకుడు

ప్రకాశం , పామూరు: పట్టణానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. కొత్త వాటర్‌ట్యాంక్‌ వీధికి చెందిన పోలిబోయిన నారాయణ (22) ఎలక్ట్రికల్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం తిరునాళ్లకని వెళ్లాడు. సీఎస్‌పురం మండలం నారాయణస్వామి దేవస్థానం వద్ద రాత్రి 11 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బుధవారం ఉదయం పామూరు పట్టణ సరిహద్దుప్రాంతం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామ పొలాల్లోని చెట్టుకు ఎవరో చున్నీతో ఉరివేసుకుని మృతిచెందినట్లు గొర్రెల కాపరుల ద్వారా పామూరు పోలీసులకు సమాచారం అందింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు మృతుడు పామూరుకు చెందిన పోలిబోయిన నారాయణగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుని మృతివార్త తెలుసుకున్న తల్లి సుగుణమ్మ, సోదరుడు ప్రభు, వదినలు సంఘటనా స్థలానికి చేరుకుని నారాయణ మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. కాగా తమ కుమారుని ఎవరోహత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపిస్తున్నారు. మృతునివద్ద మాత్రం తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదంటూ ఉత్తరం లభించింది. అయితే అఘాయిత్యానికి ముందు అతనే ఉత్తరాన్ని రాశాడా, లేక భయపెట్టి రాయించారా, వేరేవ్యక్తులు రాశారా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పండగనాడు తిరునాళ్లకు వెళ్లిన కుమారుడు తిరిగివస్తాడని ఎదురు చూసిన తల్లి, సోదరుడు, కుటుంసభ్యులు.. నారాయణ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలం నెల్లూరు జిల్లాకు చెందిన ప్రాంతం కావడంతో వరికుంటపాడు పోలీసులు కేసునమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు.
 

Back to Top