దూసుకొచ్చిన మృత్యువు

Young Man Died In Road Accident - Sakshi

బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీకొట్టిన ఇసుక   ట్రాక్టర్‌

ఘటనా స్థలంలోనే వాహనచోదకుడు మృతి

గుండెలు బాదుకుంటూ రోదించిన తల్లిదండ్రులు

తలవరంలో విషాదఛాయలు

అమ్మా... తలవరం జంక్షన్‌లో చిన్న పని ఉంది, ఫ్రెండ్‌ వస్తానన్నాడు చూసుకుని వస్తాను. అని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు అతడిపైకి దూసుకొచ్చింది. తన కుమారుడిని ట్రాక్టర్‌ ఢీకొట్టిందనే వార్త తెలిసేసరికి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం జరిగిందోనని ఘటనా స్థలానికి వచ్చేసరికి రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న కొడుకుని చూసి గుండెలు బాదుకుంటూ విలపించారు. ఆ తల్లిదండ్రుల ఆక్రందన.. ఆవేదనను చూసి కంటతడి పెట్టనివారు లేరు.

వీరఘట్టం/పాలకొండ రూరల్‌: పాలకొండ మండలం బెజ్జి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన బొత్స దాసు అలియాస్‌ గిరి(24) మృతి చెందాడు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఇతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తలవరం గ్రామానికి చెందిన బొత్స మేరమ్మ, రమణల ఒక్కగానొక్క కుమారుడు దాసు. మూడేళ్ల క్రితం రాజమండ్రిలో డిప్లామో పూర్తిచేశాడు. పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోవడంతో పై చదువులు చదవాలనే తపనతో ఓ ప్రైవేటు సంస్థలో ఏడాది నుంచి కొరియర్‌గా చేస్తున్నాడు.

ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌ తదితర యాప్‌ల్లో ఆన్‌లైన్‌ ద్వారా వస్తువులను బుకింగ్‌ చేసుకునే వారికి సకాలంలో వస్తువులు అందజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నాడు. ఈ జాబ్‌ కంటే మంచి అవకాశం రావడంతో రెండు రోజుల్లో విశాఖపట్టణం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలవరం జంక్షన్‌లో ఓ ఫ్రెండ్‌ను కలిసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బైక్‌పై వెళుతుండగా బెజ్జి రోడ్డులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టడంతో దాసు మృతి చెందాడు. దాసుకు ఇంజనీరింగ్‌ చదువుతున్న ఓ చెల్లెలు ఉంది.

మిన్నంటిన రోదన
తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనను చూసిన దాసు తల్లిదండ్రులు మేరమ్మ, రమణ ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు సపర్యలు చేయడంతో కొద్ది సేపటికి మేల్కొని రక్తపుమడుగులో ఉన్న కొడుకు మృతదేహం వద్ద బోరున విలపించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి తమను ఆదుకుంటావని అనుకుంటే మమల్ని ఒంటరిని చేశావా నాయనా... అంటూ ఆ తల్లి గుండెలు బాధుకుంటూ రోదించారు.  

ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం
ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం... అతి వేగం.. ఓ యువకుని ప్రాణం తీసింది. పనసనందివాడ ఇసుక ర్యాంపునకు వెలుతున్న ట్రాక్టర్‌ బెజ్జి రోడ్డులో మామిడితోటకు సమీపంలో ఉన్న మలుపు వద్ద అతివేగంతో వస్తూ ఎదురుగా వస్తున్న దాసు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాసు రోడ్డుపై దూరంగా పడిపోయాడు. తలకు హెల్మెట్‌ ఉన్నప్పటికీ హెల్మెట్‌ కూడా తుల్లిపోవడంతో రోడ్డుకు అతడి తల బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు.

డీఎస్పీ పరిశీలన
ట్రాక్టర్‌ ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడనే వార్త తెలియగానే పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగారు. మృతుడు తల్లి మేరమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్‌ చేయాలని సీఐ సూరినాయుడిని, వీరఘట్టం ఎస్సై అప్పారావును ఆదేశించారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ఈ ప్రమాద ఘటనపై ఎస్సై జి.అప్పారావు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top