‘మ్యూజియం దొంగలకు’ రెండేళ్ల జైలు

Two years Prison Punishment For Nizam Museum Thief - Sakshi

2018లో నిజాం మ్యూజియంలో భారీ చోరీ

రికార్డు సమయంలోనిందితుల అరెస్టు, రికవరీ

దోషులుగా తేల్చి రెండేళ్ల శిక్ష విధించిన కోర్టు

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్‌ ఎగ్జాల్డెడ్‌ హైనెస్‌ (హెచ్‌ఈహెచ్‌) నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను నాంపల్లి కోర్టు దోషులుగా తేల్చింది. 2018లో జరిగిన ఈ కేసును సిటీ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రికార్డు సమయంలో ఛేదించి, సొత్తును యథాతథంగా రికవరీ చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 4 తెల్లవారుజామున ఈ దొంగతనం జరగ్గా.. అదే నెల 11న ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ముబిన్‌ అనారోగ్యం నేపథ్యంలో 2018 జూలై ఆఖరి వారంలో మస్రత్‌ మహల్‌ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో టోకెన్‌ తీసుకున్న మొబిన్‌ కాలక్షేపానికి దగ్గరలో ఉన్న నిజాం మ్యూజియంలోకి వెళ్లాడు. అక్కడ అవసరమైన భద్రత చర్యలు లేకపోవడంతో పాటు అందులో ఉన్న బంగారం టిఫిన్‌ బాక్స్, కప్పు, సాసర్, టీ స్ఫూన్‌లతో పాటు బంగారం పొదిగిన ఖురాన్‌ను ఇతడిని ఆకర్షించాయి.

ఈ పురాతన వస్తువుల్ని చోరీ చేసి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. రాజేంద్రనగర్‌ ప్రాంతానికే చెందిన సెంట్రింగ్‌ వర్కర్‌ మహ్మద్‌ గౌస్‌ పాషాతో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018 సెప్టెంబర్‌ 3 అర్ధరాత్రి స్క్రూడ్రైవర్లు, కటింగ్‌ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్స్‌లతో ద్విచక్ర వాహనంపై మ్యూజియం వద్దకు చేరుకున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న గ్లాస్, గ్రిల్స్‌ తొలగించిన దాని ద్వారా మొబిన్‌ లోపలకు దిగాడు. ఓ అల్మారా పగులకొట్టి టిఫిన్‌ బాక్స్, కప్పుసాసర్, స్ఫూను తస్కరించి బ్యాగ్‌లో సర్దుకుని రాగా.. ఇద్దరూ కలిసి వాహనంపై పరారయ్యారు. తొలుత ఆ వస్తువుల్ని గోతిలో పాతిన ఇద్దరూ ముంబై వెళ్లి వచ్చిన తర్వాత తవ్వి తీసి భోజనం చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 4న నమోదైన ఈ కేసులో నిందితుల కోసం రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడంతో పాటు బంగారం టిఫిన్‌బాక్స్, టీకప్పు, సాసర్, స్ఫూన్‌ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన మీర్‌చౌక్‌ పోలీసులకు నిందితులపై పక్కాగా అభియోగాలు మోపారు. వీటిని విచారించిన నాంపల్లి కోర్టు మంగళవారం ఇద్దరు దొంగల్నీ దోషులుగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top