వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య  

Three People Commit Suicide In Warangal - Sakshi

నారబోయినగూడెంలో రైతు

కురవిలో యువతి

లక్నెపల్లిలో ఆటో డ్రైవర్‌     బలవన్మరణం      మూడు గ్రామాల్లో      విషాదఛాయలు

ఉమ్మడి వరంగల్‌లో జిల్లాలో వేర్వేరు ఘటనల్లో గురువారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని నారబోయినగూడెంలో రైతు, మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో యువతి, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లిలో ఆటోడ్రైవర్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

పాలకుర్తి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక మండలంలోని నారబోయినగూడెం  గ్రామంలో చిక్కుడు సుధాకర్‌(28) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కుడు సుధాకర్‌కు భార్య లావణ్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆ కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అవి తీర్చలేక మానసికాందోళనకు గురై గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడు తండ్రి రాంచంద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. 

కురవిలో యువతి..

కురవి : జీవితంపై విరక్తి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కురవి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగభూషణం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని 747 కాలనీలో 21 సంవత్సరాల దివ్యాంగ యువతి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. మూడు నెలల క్రితం ఆమెపై లైంగిక దాడి జరిగింది. దీంతో బుధవారం రాత్రి సదరు యువతి ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. యువతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా మండల కార్యదర్శి గంధసిరి పద్మ, నాయకులు నాగమ్మ, వీరలక్ష్మి, హచ్చాలి, యాదమ్మ డిమాండ్‌ చేశారు. 

లక్నెపల్లిలో ఆటోడ్రైవర్‌..

నర్సంపేట రూరల్‌ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన కుడికందుల రాము (34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్యలత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు మతిస్థిమితం సరిగా లేదు.

ఇటీవల డిజిల్‌ ధరలు పెరిగి, కిరాయిలు తగ్గడంతో కుటుంబ పోషణ భారమైంది. ఆటో కిస్తీలు, ఇతర ఫైనాన్స్‌లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్‌ అధ్యక్షుడు కళ్లెపల్లి సురేష్, టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు కోడారి రవి, గ్రామ అధ్యక్షుడు గోడిశాల శ్రీను,  మాజీ ఉపసర్పంచ్‌ భగ్గి నర్సింహారాములు కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top