నిజాం మ్యూజియం చోరీ కేసు: నిందితుల అరెస్ట్‌

Theives Arrested In Nizam Museum Theft Case - Sakshi

హైదరాబాద్‌: నిజాం మ్యూజియం చోరీ కేసును సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ‘చోరీకి పాల్పడిన నిందితులు మహ్మద్‌ గౌస్‌ పాషా, మహ్మద్‌ ముబీలను అరెస్ట్‌ చేశాం. 2000 సంవత్సరంలో పురాణాహవేలీలో నిజాం జూబ్లీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రజల కోసం మ్యూజియం ఏర్పాటు అయింది. 1925 గ్రాముల బరువున్న టిఫిన్‌ బాక్సు లూటీ అయింది. ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసే ఒక్కో డైమండ్‌తో టిఫిన్‌ బాక్స్‌ను నిజాం కాలంలో తయారు చేశారు. దోపిడీ అయిన ఆస్తుల విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పటి వరకు ఎంత ఖరీదు చేస్తుందనేది ఎవరికీ తెలియదు. సంచలనంగా మారిన కేసును త్వరితగతిన చేధించా’మని అంజనీ కుమార్‌ వెల్లడించారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘1991లో యూరప్‌లో, 1990లో అమెరికాలోని మ్యూజియాల్లో దోపిడీలు జరిగాయి. కానీ అక్కడి పోలీసులు కేసులను చేధించినా పూర్తిస్థాయిలో సొత్తును రికవరీ చేయలేకపోయారు. కానీ నిజాం మ్యూజియం చోరీ కేసులో పూర్తి ఆస్తులు రికవరీ చేశాం. మ్యూజియంలోని పైకప్పు నుంచి దొంగలు తాడు సహాయంలో లోపలికి దిగారు. మ్యూజియంలోని కెమెరాకు చిక్కకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. గదిపై భాగంలో కిటికీలు ఉన్నాయి. వాటి ఆధారంగా నిందితులు బయటికి వెళ్లినట్లు గుర్తించాం. కిటికీలు ఎక్కువ వెడల్పు లేకపోవడంతో నిందితులు స్లిమ్‌గా ఉంటారని నిర్ధారణకు వచ్చాం. 20 టీమ్‌లు నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టాయి. ఒక టీం.. మ్యూజియంలోనికి దొంగలు ఎలా వచ్చారు అని, మరో టీం ఎలా బయటికి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేశాయి. పోలీసులను తప్పుదోవ పట్టించాలని నిందితులు ప్రయత్నం చేశార’ని కమిషనర్‌ పేర్కొన్నారు.

దోపిడీ అనంతరం ఇద్దరు నిందితులు బైక్‌పై లోకల్‌గా చక్కర్లు కొట్టారని చెప్పారు. నెల రోజుల నుంచి నిజాం మ్యూజియం వద్ద రెక్కీ నిర్వహించారని తెలిపారు. అంతకు ముందు ఓసారి నిందితులు మ్యూజియంను సందర్శించడానికి వచ్చారని వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన ముబీన్‌ గల్ఫ్‌లో ఓసారి జైలు జీవితం కూడా గడిపినట్లు అంజనీకుమార్‌ చెప్పారు. అలాగే నిందితులు ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top