అందరూ చూస్తుండగానే ఆత్మహత్య

Everyone looks at suicide - Sakshi

జనం కళ్లెదుటే క్వారీ గుంతలో పడిపోయిన వివాహిత

మృతురాలి వివరాల కోసం పోలీసుల ఆరా

హైదరాబాద్‌: అందరూ చూస్తుండగా ఓ గుర్తు తెలియని మహిళ క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకుంది. వారిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌ శివారులోని గాజుల రామారం దేవేందర్‌నగర్‌ ప్రాంతంలో కొన్ని క్వారీ గుంతలున్నాయి. ఏళ్ల తరబడి వీటిని వినియోగించకపోవడంతో నిండా నీళ్లు చేరాయి. ఈ గుంతల వద్ద దేవేందర్‌నగర్‌ వైపు కొన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు. అంతలో గుంతలకు అవతలి వైపున ఉన్న ఖైసర్‌నగర్‌ నుంచి ఓ వివాహిత నడుచుకుంటూ రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో ముందుకు వెళ్లవద్దంటూ వారిస్తూ, అరుస్తూ ఆమె వైపునకు కొందరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

మరికొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీయడం మొదలెట్టారు. ఏమీ పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్లిన ఆమె క్వారీ గుంతలోకి దిగుతూ ఆరడుగులు వేసింది. హఠాత్తుగా పట్టుతప్పి కాలు జారడంతో నీళ్లల్లోకి పడిపోయింది. తలకు రాళ్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆమె నీళ్లలో పడిన కొద్దిసేపటికే చనిపోయింది. మృతదేహాన్ని స్థానికులు వెలికితీయగా జగద్గిరిగుట్ట పోలీసులు వచ్చి దానిని మార్చురీకి తరలించారు. మృతురాలి గురించిన వివరాలు తెలియకపోవడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని ఠాణాలకు సమాచారమిచ్చారు. గత రెండు రోజుల్లో నమోదైన మిస్సింగ్‌ కేసుల్నీ పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరన్నది తెలిస్తే తప్ప ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. 

మరణాలకు కేరాఫ్‌ అడ్రస్‌
దేవేందర్‌నగర్‌ శివార్లలో మొత్తం 14 క్వారీ గుంతలున్నాయి. ఇవి ప్రమాదాలకు, ఆత్మహత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాయి. రెండేళ్లలో ఈ ప్రాంతంలో 14 మంది చనిపోయారు. క్వారీ గుంతల చుట్టూ ఫెన్సింగ్‌ నిర్మించాలని కలెక్టర్‌ కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసినా అతీగతీలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top