ప్రపంచ పరిణామాలే ప్రధానం

'Trade war fears, crude oil prices to dictate market sentiment this week' - Sakshi

మళ్లీ వాణిజ్య యుద్ధాల భయాలు  

చమురు ధరల కదలికలు కీలకమే  

రుతుపవనాల విస్తరణపై దృష్టి

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు  

మళ్లీ చెలరేగిన వాణిజ్య యుద్ధ భయాలు ఈ వారం ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రుతుపవనాల విస్తరణ, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ   తదితర అంశాలు కూడా మార్కెట్‌పై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.

కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఆర్‌బీఐ పాలసీ, రిటైల్, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వంటి కీలకమైన దేశీయ అంశాలన్నీ ముగియడంతో భారత స్టాక్‌ మార్కెట్‌ స్తబ్దత స్థాయికి వెళ్లిపోయిందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకని ఈ వారం అంతర్జాతీయ సంకేతాలే మార్కెట్‌కు కీలకమని వారంటున్నారు.

వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం  
చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించడంతో..అందుకు ప్రతిగా చైనా కూడా సుంకాలు విధించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగే అవకాశాలుండటం మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నదని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(రీసెర్చ్‌) టీనా వీర్మాణి చెప్పారు. కీలకమైన దేశీయ అంశాలు అన్నీ ముగిసిపోయాయని, ఇక అంతర్జాతీయ పరిణామాలపైననే అందరి కళ్లూ ఉంటాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తపా నదీమ్‌ చెప్పారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రుతు పవనాల విస్తరణపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని హెమ్‌  సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ జైన్‌ చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగడం సమీప భవిష్యత్తులో మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  ముడి చమురు సరఫరా కోతల విషయమై ఒపెక్, రష్యాల సమావేశంపై మార్కెట్‌ దృష్టి పెడుతుందని వివరించారు.

రూపాయి క్షీణత  మార్కెట్లో కొంత వరకూ కలవరం సృష్టిస్తున్నట్లు  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సెన్సెక్స్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నేటి నుంచి సెన్సెక్స్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ స్థానంలో వేదాంత షేర్‌ను చేరుస్తున్నారు.  ఈ ఏడాది వర్షాలు  సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ  శాఖ అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌ నిచ్చాయి. అయితే నైరుతి రుతు పవనాలు సకాలంలోనే ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతోంది.

రెండు ఐపీఓలు..
ఇక ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తున్నాయి. రూ.180–185 ప్రైస్‌బ్యాండ్‌తో రైల్వేలకు చెందిన రీట్స్‌ కంపెనీ రూ.460 కోట్లు సమీకరించనున్నది. మరోవైపు రూ.780–783 ప్రైస్‌బ్యాండ్‌తో ఫైన్‌ ఆర్గానిక్స్‌ కంపెనీ రూ.600 కోట్లు సమీకరించనున్నది. ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ రెండు కంపెనీల ఐపీఓలు ఈ నెల 22న ముగుస్తాయి.  ఈ రెండు కంపెనీల షేర్లు వచ్చే నెల 2న స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.

ఇక అంతర్జాతీయ పరిణామాల పరంగా చూస్తే, నేడు(సోమవారం) జపాన్‌ వాణిజ్య  గణాంకాలు వస్తాయి. ఈ నెల 20న(బుధవారం) జపాన్‌ కేంద్ర బ్యాంక్‌ సమావేశ వివరాలు, అమెరికాలో  ఇళ్ల విక్రయ గణాంకాలు  వెల్లడవుతాయి. ఈ నెల 21న(గురువారం) బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడుతుంది. శుక్రవారం (ఈ నెల 22న) జపాన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి.

రూ. 5,500 కోట్ల విదేశీ నిధులు వెనక్కి...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి ఈ నెలలో రూ.5,500 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.831 కోట్లు, డెట్‌మార్కెట్‌ నుంచి రూ.4,683 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు చెలరేగడం, రేట్ల పెంపు విషయమై ఫెడరల్‌ రిజర్వ్‌ వ్యాఖ్యల కారణంగా ఈ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.2,400 కోట్లు పెట్టుబడులు పెట్టగా,  డెట్‌ మార్కెట్‌ నుంచి  రూ.35,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top