
న్యూఢిల్లీ : రైల్వే వ్యవస్థలో భారీగా ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయి. ఏడాదిలోనే 10 లక్షల ఉద్యోగాలను రైల్వే ఎకోసిస్టమ్ సృష్టించగలదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రైల్వేలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు అందకపోయినప్పటికీ, ఈ వ్యవస్థలో వివిధ ఏరియాల్లో పనిచేసే వారికి 12 నెలల కాలంలోనే మిలియన్ కొద్ది ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు. కేవలం రైల్వేలు, దాని వ్యవస్థ మాత్రమే ఇన్ని ఉద్యోగాలను సృష్టించనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఇండియా ఎకనామిక్ సమిట్ వద్ద గోయల్ చెప్పారు.
రైలు ట్రాక్, భద్రత పరిరక్షణ ప్రొగ్రామ్‌లోనే 2 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా రైల్వే భద్రతపై ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒకవేళ పైప్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే, ప్రస్తుతమున్న ప్రాజెక్టుల్లోనే 2 లక్షల నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. భారీ పెట్టుబడి సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉందని, కానీ దేశం రూపాంతరం చెందడానికి ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. పెట్టుబడి పెట్టడానికి ప్రపంచంలో ఏ దేశం కూడా మంచిగా లేదని, భారత్ కంటే ఏది పెద్దది కాదని చెప్పారు.