చైనాలో 5జీ సేవలు షురూ

China to launch 5G services Friday - Sakshi

సర్వీసులు ప్రారంభించిన 3 టెల్కోలు

బీజింగ్‌: టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్‌ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్‌ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించాయి.

ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డ్రైవర్‌రహిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్‌ వంటి వాటికి ఇవి ఉపయోగపడనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో.. 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. 5జీ పరికరాల ఉత్పత్తిలో అగ్రగాములైన చైనా సంస్థలు హువావే, జెడ్‌టీఈలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top