
బడ్జెట్‌పై బాలీవుడ్ సెలబ్రిటీల అంచనాలిలా..
ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 5న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ తమదైన అంచనాలు నెలకొన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెట్టబోయే తొలి పూర్తిస్ధాయి బడ్జెట్ కావడంతో ప్రజలు ఈ బడ్జెట్‌పై ఆశలు పెంచుకున్నారు.
ఈ బడ్జెట్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం భారీ అంచనాలతోనే ఉన్నారు. బడ్జెట్‌లో పలు రంగాలను ఉత్తేజపరిచే చర్యలు అవసరమని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ప్రజల ముందుకు వస్తుందనే విశ్వాసం తనకుందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై తనకు భారీ అంచనాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇక నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ధరల భారం నుంచి బడ్జెట్‌లో ఉపశమనం కల్పించాలని నటి మహీ గిల్ కోరారు.
విలాస వస్తువుల ధరలు పెరిగినా నష్టం లేదని, ఆహార ఉత్పత్తుల ధరులు పెరిగితే మాత్రం మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. వినోద పరిశ్రమపై విధించిన 18 శాతం పన్నును భారీగా తగ్గించాలని జిమ్మీ షెర్గిల్ కోరారు. మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నిర్మాతలు భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో బాలీవుడ్ వద్ద పెద్దమొత్తంలో నిధులున్నాయనే అభిప్రాయం నెలకొందని, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఇక సామాన్యుడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించాలని టీవీ స్టార్ నందిష్ సంధూ కోరారు. మరోవైపు రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.