
పిఠాపురం: నవరత్నాల పథకాలను ప్రతి కుటుంబానికీ వివరించాలని వైఎస్సార్ సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి బూత్ కమిటీల సభ్యులకు సూచించారు. పిఠాపురం రైస్‌మిల్లర్ల అసోసియేషన్ భవనంలో శనివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బూత్ కమిటీల సభ్యులు ముందుగా ఆయా ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి నాయకులకు వివరిస్తే ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ద్వారా వారు వాటికి పరిష్కార చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ సీబీఐని రాకుండా చేయాలని చంద్రబాబు విడుదల చేస్తున్న జీఓలు కొనసాగవన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఏజెంట్ల వ్యవస్థ పటిష్టంగా ఉండేలా నాయకులు జాగ్రత్త పడాలన్నారు. పార్టీ కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఒక వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి ఆ వ్యక్తిని ఓడించి పరోక్షంగా మరో వ్యక్తిని నెగ్గించుకునే కుట్రలు చేసి పిఠాపురం ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబును అభివర్ణించారు. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎక్కడ సీబీఐకి అప్పగిస్తారో అన్న భయంతో సీబీఐని నిరాకరిస్తూ జీఓలు విడుదల చేస్తున్నారన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడు కరుణిస్తే తాను పోటీ చేస్తానని జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఇక్కడ పోటీ చేసినా దానికి దీటుగా మనం అందరు పనిచేసేలా ఉండాలన్నారు.
పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా వైఎస్సార్ సీపీని విమర్శించడం చూస్తుంటే టీడీపీ, జనసేన కుట్రగా కనిపిస్తోందన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నయవంచనకు మారు పేరుగా ఒక్క చంద్రబాబు మాత్రమే నిలబడతారని అన్నారు. మాజీమంత్రి కొప్పన మోహనరావు మాట్లాడుతు ప్రజావ్యతిరేక విధానాలతో పాలన చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పార్లమెంటు బూత్ కమిటీల కన్వీనర్ పీవీఆర్ చౌదరి, కర్రి పాపారాయుడు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, గండేపల్లి బాబీ, మొగిలి బాబ్జీ, బుర్రా అనుబాబు, కురుమళ్ల రాంబాబు, రావు చిన్నారావు, వెంగళి సుబ్బారావు, వడిశెట్టి నారాయణరెడ్డి, మాదిరెడ్డి దొరబాబు, చింతపల్లి ఏసురెడ్డి, బూత్ కమిటీల కన్వీనర్లు కన్నాబత్తుల కామేశ్వరరావు, బొజ్జా అయలు, కారే శ్రీనివాసరావు, దాసం పూజలు, పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మహిళాధ్యక్షురాలు కన్నాబత్తుల నాగేశ్వరి పలువురు నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. పెండెం దొరబాబును గెలిపించుకోండి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా పెండెం దొరబాబును గెలిపించుకునే బాధ్యత అందరిపైనా ఉందని, తద్వారా జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైవీ సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పిఠాపురంలో పార్టీ పటిష్టంగా ఉందని చిన్నచిన్న సమస్యలు ఉన్నా వాటిని సరిదిద్దుకుని అందరు ఏకతాటిపై పనిచేసి విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్దిగా పెండెం దొరబాబును ఆయన ప్రకటించడంతో పార్టీ శ్రేణులు దొరబాబును అభినందించారు.