విజయనగరానికి కొత్త హోదా..

Vizianagaram Changed Now Municipolity - Sakshi

జూలై 3 నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం

డివిజన్ల విభజనకు ఏర్పాట్లు

32 రోజుల్లోగా విభజన ప్రక్రియ

విజయనగరం మున్సిపాలిటీ: చారిత్రాత్మక నగరం కొత్త హోదా దక్కించుకునే ప్రక్రియ జోరందుకుంది. మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం జూలై 3 నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందనుండగా... అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది.  40 వార్డులతో ఇప్పటివరకు సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరాన్ని 50 డివిజన్‌లుగా విభజించాలంటూ  ఆదేశాలు వచ్చాయి. రానున్న 32 రోజుల్లో  వార్డులను డివిజన్‌లుగా మార్చాలంటూ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కె.కన్నబాబు  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రత్యేక షెడ్యుల్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి 17వ తేదీలోగా  టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ప్రస్తుమున్న 40 వార్డులను 50 డివిజన్‌లుగా విభజించాలి. 18వ తేదీ నుంచి 27 లోగా డివిజన్‌లపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ పత్రికల్లో పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో  పాటు  స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. 28వ తేదీన పూర్తి చేసిన 50 డివిజన్‌ల విభజన ప్రతిపాదనలను డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేయాలి. 29, 30 తేదీల్లో డీఎంఏ పరిశీలన అనంతరం 31 నుంచి జూలై 3వ తేదీలోగా ఆ ప్రతిపాదలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. 3,4,5,6 తేదీల్లో  ప్రభుత్వ పరిశీలన అనంతరం డివిజన్‌ల ఏర్పాటుపై  ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మరల 7, 8 తేదీల్లో  ఆమోదముద్ర వార్డు డివిజన్‌లను మరల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ దినపత్రికల్లో  మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పబ్లికేషన్‌ చేయాలి. మొత్తం అన్ని పనులనూ 32 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. 

ఈశాన్యం నుంచి విభజన ప్రక్రియ ప్రారంభం
విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నాటికి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మారింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2, 44, 598 మంది జనాభా ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ హోదా దక్కించుకోనున్న విజయనగరంలో డివిజన్‌ల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆదేశాల మేరకు  నార్త్‌ ఈస్ట్‌ (ఈశాన్యం)నుంచి  విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది.  ప్రస్తుత విజయనగరం భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే విజయనగరం– నెల్లిమర్ల ప్రధాన రహదారిలో గల వేణుగోపాలపురం నుంచి ప్రారంభించనున్నారు.  అక్కడి నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ సవ్యదిశ (క్లాక్‌వైజ్‌)లో భౌగోళికంగా చేపట్టాల్సి ఉంటుంది.

2011 జనాభా ఆధారంగానే...
జూలై 3 నుంచి కార్పొరేషన్‌ హోదా దక్కించుకోనున్న  విజయనగరంలో డివిజన్‌ల విభజన 2011 జనాభా ఆధారంగానే జరగనుంది. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న విజయనగరంలో 40 వార్డులుండగా.. వాటిని 50 డివిజన్‌లుగా  విభజించాల్సి ఉంది.  2011 జనాభా లెక్కల ప్రకారం 2, 44, 598 మంది జనాభా  పట్టణ పరిధిలో నివసిస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు 50 డివిజన్‌లను ఒక్కో డివిజన్‌కు 5 వేల మంది జనాభా ఉండేలా  విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో డీఎంఏ ఆదేశాలు జారీ చేయగా..  అన్ని డివిజన్‌లలో 10 శాతం హెచ్చుతగ్గుల్లో సరాసరి జనాభా ఉండేలా నిబంధన పాటించాలని సూచించింది.

అమోదం సాధ్యమేనా...?
ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉన్న వార్డులను డివిజన్‌లుగా మార్పు చేసి ప్రభుత్వ ఆమోద్ర వేసే విషయంలో సా«ధ్యా అసాధ్యాలపై చర్చ సాగుతోంది. మున్సిపల్‌ యాక్ట్‌ ప్రకారం అధికారులు తయారు చేసే డివిజన్‌ల విభజన ప్రక్రియను కార్పొరేషన్‌ పాలకవర్గం కానీ  కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా ఉన్న అధికారి ఆమోద్ర ముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే జూలై 2వ తేదీ వరకు ప్రస్తుత మున్సిపల్‌ పాలకవర్గానికి గడువు ఉండడంతో ఎవరు ఆమోద ముద్ర వేసి డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఆదేశాలు వచ్చాయి..
మున్సిపాలిటీగా ఉన్నవిజయనగరానికి త్వరలో కార్పొరేషన్‌ హోదా రానుంది. ఈ నేపథ్యం లో డీఎంఏ ఆదేశాల మేర కు 40 వార్డులను  50 డివిజన్‌లుగా మార్పు చేయాల్సి ఉంది. 2011 జనాభా ఆధారంగా  నార్త్‌–ఈస్ట్‌ నుంచి గడియారం దశలో  ఈ విభజన ప్రక్రియ  చేపడతాం.  ఈ ప్రక్రియను మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చేపట్టనున్నారు. షెడ్యూల్‌ మేరకు 32 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
– ఎస్‌ఎస్‌ వర్మ, కమిషనర్, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top