అసంపూర్తి వంశధార!

Vamsadhara Works Are Not Yet Completed - Sakshi

ఫేజ్‌–2 ప్రాజెక్టు ప్రారంభానికి టీడీపీ నేతల హడావుడి!

చంద్రబాబుతో మమ అనిపించేయాలని సన్నాహం?

మందకొడిగా 87 ప్యాకేజీ పనులు 

అధికారుల హెచ్చరికలకు ‘రిత్విక్‌’ బేఖాతరు 

88 ప్యాకేజీలోనూ 30 శాతం పెండింగ్‌

జలాశయంలో 80 శాతం నిర్మాణ పనులు పూర్తి

కొలిక్కిరాని సైడ్‌వియర్, స్పిల్‌వే నిర్మాణం

హడావుడి పనులతో నాణ్యతపై సందేహాలు! 

ఈ చిత్రం చూశారా?.. భామిని మండలం పసుకుడి వద్ద వంశధార వరద కాలువపై రెండేళ్లుగా నిర్మిస్తున్న వంతెన. కానీ ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. అయితే పూర్తయినట్లు చూపించడానికి వంతెనను రెండు స్తంభాలకే పరిమితం చేస్తున్నారు. మిగతా స్తంభాల మధ్య మట్టిని పూడ్చేస్తున్నారు. కాలువలో నీటిప్రవాహం పెరిగితే ఆ మట్టి కాస్త కొట్టుకుపోదనే భరోసా లేదు. ఇలాంటి స్ట్రక్చర్ల నిర్మాణాలు వంశధార ప్రాజెక్టు పనుల్లో మరెన్నో!

సాక్షి ప్రతినిధి-శ్రీకాకుళం : వంశధార ఫేజ్‌-2 స్టేజ్‌-2... మండువేసవిలోనూ జిల్లాకు సాగు, తాగునీరు అందించే బృహత్తర పథకం! దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రసాదించిన ఓ వరం! ఆయన హయాంలోనే సగానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి! కానీ ఆయన అకాల మరణం ఈ ప్రాజెక్టుకు శాపమైంది! తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితమే టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టింది!

కానీ నిర్మాణ కంపెనీలు నిర్మాణ వ్యయం పెంపుపై పెట్టిన దృష్టి... ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయడంపై పెట్టలేదు! ఒకవైపు నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించేసి ఇదిగో అది గో ప్రారంభం అంటూ టీడీపీ నాయకులు చెబుతూ వచ్చారు! ప్రాజెక్టు పనులు మాత్రం ఎక్కడా కొలిక్కి రాలేదు! కానీ ఈనెల 15వ తేదీన శ్రీకాకుళంలో స్వాతంత్య్ర దినోత్సవానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభింపజేస్తామని టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు! 

వాస్తవానికి వంశధార ఫేజ్‌-2 స్టేజ్‌-2 పనులు మూడు భాగాలుగా జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే హిరమండలం uమొదటిపేజీ తరువాయి
రిజర్వాయర్‌ మట్టి పనులు 80 శాతం పూర్తయ్యాయి. భామిని, కొత్తూరు మండలాల్లో 87 ప్యాకేజీ పనులు 31 శాతం, కొత్తూరు మండలంలో 88 ప్యాకేజీ పనులు 36 శాతం పనులు జరిగాయి. తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు అసలు ఈ పనుల కొనసాగింపుపై దృష్టి పెట్టలేదు. కానీ తర్వాత హడావుడి మొదలెట్టింది. మొత్తం నిర్మాణ వ్యయం అంచనాలను రూ.934 కోట్ల నుంచి రూ.1616.23 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచేసింది. 87, 88 ప్యాకేజీల పనుల నుంచి పాత కాంట్రాక్టు సంస్థలను తప్పించి తన అనుయాయులకు అప్పగించింది. కానీ పనులు మాత్రం గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టును ప్రారంభించి ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా సత్వరమే పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా 87 ప్యాకేజీ పనులు చేస్తున్న రిత్విక్‌ సంస్థ మాత్రం బేఖాతరు చేస్తోంది. ఈ సంస్థ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందినది కావడం గమనార్హం. ఇప్పటివరకూ తూతూ మంత్రంగా చేస్తున్న పనులు కూడా వర్షాల ప్రారంభంతో పడకేశాయి. 

87 ప్యాకేజీ పనులిలా...

ప్రాజెక్టు 87 ప్యాకేజీలో మొత్తం 13 కిలోమీటర్ల పొడవున 93,105 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్, 27.84 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. తొలుత ఈ పనులను హార్విన్స్‌ సంస్థ చేపట్టింది. 7 కి.మీ. మేర పూర్తి చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులను రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అప్పగించింది. గత ఏడాది జూలై నాటికి 19,512 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్, 13.11 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి చేసింది. తర్వాత ఈ జూలై నెలాఖరునాటికి 76,567 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, 23.95 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి అయ్యాయి. ఇంకా 16,538 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్, 3.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనులు చేయాల్సి ఉంది.   

88 ప్యాకేజీ పనులిలా...

ప్రాజెక్టు 88 ప్యాకేజీ కింద మొత్తం 20 కి.మీ. మేర 1,07,589 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్, 40.87 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనులు చేయాల్సి ఉంది. దీనిలో 20 శాతం పనులు చేసిన శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థను తొలగించి టీడీపీ ప్రభుత్వం సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అప్పగించింది. గత ఏడాది జూలై నాటికి 43 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టిపనులు పూర్తయ్యాయి. తర్వాత ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి 92,045 క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్, అలాగే 32.18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. ఇంకా 15,544 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, అలాగే 8.68 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలే ఉన్నాయి.

హిరమండలం రిజర్వాయర్‌లో...

ప్రధానమైన హిరమండలం రిజర్వాయరు పనుల్లో ప్రస్తుతం స్పిల్‌వే లింక్, కెనాల్‌ కాంక్రీట్‌ పనులే జరుగుతున్నాయి. అలాగే  ఎర్త్‌డ్యామ్, గట్టు రాతి కట్టడాల మిగులు పనులు కూడా పూర్తి కాలేదు. ఇటీవల వర్షాలతో ఈ పనులకు ఆటంకం కలిగింది. ఐవోబీ సమావేశాల్లో వంశధార పనులపై అధికారులు సమీక్షిస్తూ కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేస్తునే ఉన్నారు. కానీ పనులు మాత్రం వేగవంతం కావట్లేదు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top