
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలు సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్ (సమర్థతకు కేంద్ర బిందువులు) కావాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిలషించారు. యూనివర్సిటీల్లో పాఠాలే కాదు.. శాస్త్రీయ పరిశోధనలకు మరింత ప్రాధాన్యత పెరగాలని, విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలని కోరారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం సాయంత్రం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వేలాదిగా వచ్చిన పూర్వ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కలలుకంటూ వాటి సాకారానికి కష్టపడాలని సూచించారు. అధ్యాపకులు కూడా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గురువుకు గూగుల్ ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని గుర్తించాలని వెంకయ్యనాయుడు అన్నారు.