అడిగేవారు లేని డ్వామా అధికారులు ఇచ్చిమొచ్చినట్లు ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారు. నిబంధనలకు పాతరేసి లక్షలాది రూపాయల విలువైన ప్రింటింగ్ పనులను అనుమతి ఇచ్చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: అడిగేవారు లేని డ్వామా అధికారులు ఇచ్చిమొచ్చినట్లు ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారు. నిబంధనలకు పాతరేసి లక్షలాది రూపాయల విలువైన ప్రింటింగ్ పనులను అనుమతి ఇచ్చేస్తున్నారు. తాము తక్కువ ధరకే ప్రింటింగ్ చేస్తామంటూ కొందరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ముందుకొచ్చిన అవేమీ పట్టించుకోవడం లేదు. టెండర్లు పిలవకుండానే రూ.ఐదు లక్షల విలువచేసే ప్రింటింగ్ పనులు అనుమతులివ్వడం చర్చనీయాంశంగా మారింది.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై గ్రామ సర్పంచ్‌లు, మహిళా సమాఖ్యలు, శ్రమశక్తిసంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కరపత్రాలు, బ్యానర్లను ప్రింటింగ్ చేయించారు. ఇందుకోసం గతనెల 22తేదీన రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఉపాధి పనులకు సంబంధించి బడ్జెట్ రూపొందించే విధానాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చే యడానికి అక్టోబర్ 31న సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు.
నవంబర్ నెల మొత్తం గ్రామాలకు వెళ్లి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏయే పనులు అవసరమో గుర్తించి క్యాలెండర్‌ను రూపొందించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అందుకు అవసరమైన విస్తృతప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రచార సామగ్రిని టెండర్లు పిలువకుండానే ప్రింటింగ్ చేయించారు. బ్యానర్లను తయారు చేయించేందుకు పట్టణంలోని నాలుగు డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కొటేషన్లు తీసుకున్నారు. ఈ నాలుగు కూడా బినామీపేర్లతో కొటేషన్లు తీసుకుని బ్యానర్ల కోసమే రూ.3,56,400 ఖర్చుచేసి ఒకే ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేయించారు.
నిబంధనలకు నీళ్లు!
6x4 సైజు కలిగిన బ్యానర్ల తయారీ కోసం ఒక్కో చదరపు గజానికి రూ.9 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇదిలాఉండగా అత్యవసరమైతే కనీసం పర్చేస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకుని ప్రింటింగ్ చేయించాల్సి ఉన్నా అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు. టెండర్లు పిలిచి పనులు అప్పగించి ఉంటే అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా ఉండేదని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా 6ఁ4, 6ఁ12 సైజుతో తయారుచేసిన బ్యానర్లకు ఒకే ధర నిర్ణయించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరపత్రాల విషయానికొస్తే ఒకే వ్యక్తి బినామీ పేర్లతో మూడు వేర్వేరు ప్రింటింగ్ ప్రెస్‌ల పేరుతో కొటేషన్ తీసుకుని కరపత్రాల ముద్రణ పనులు అప్పగించారు. ఉపాధి పనులు తెలియజేసే కలర్, బ్లాక్ అండ్ వైట్ (ఏ 4 సైజ్) కరపత్రాలు ప్రింటింగ్ చేయించారు. ఇందులో బ్లాక్ అండ్ వైట్‌కు సంబంధించిన కరపత్రాలు వెయ్యికి రూ. 459 చొప్పున 1.75లక్షల కరపత్రాలకు మొత్తం రూ.80325 చెల్లించారు. అదేవిధంగా 25వేల కలర్ ప్రింటింగ్ కరపత్రాలు వెయ్యికి రూ. 666 చొప్పున రూ.16,650కు అనుమతులిచ్చారు.
గతనెలలో 2.20 లక్షల కరపత్రాల ప్రింటింగ్ కోసం సాక్షర భారత్ అధికారులు పర్చేస్ కమిటీ అనుమతితో టెండర్లు నిర్వహించి ఏ4 సైజు వెయ్యి కరపత్రాలకు రూ.238 ప్రకారం చెల్లించగా, డ్వామా అధికారులు మాత్రం ఎక్కువరేట్లకు అనుమతులివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అత్యవసరంతోనే టెండర్లు
పిలువలేకపోయాం
కరపత్రాలు, బ్యానర్లు అత్యవసరం కావడంతో టెండర్లు పిలువకుండా ప్రింటిం గ్ పనులు చేయించాం. ఇందులో ఎ లాంటి అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. తదుపరి చేపట్టే ఎలాంటి పనులనైనా టెండర్ ద్వారానే చేపడతాం.
- విద్యాశంకర్, డ్వామా పీడీ
అధిక రేట్లకు పనులు అప్పగించారు
టెండర్లు పిలువకుండా కరపత్రాల ముద్రణకు అధికరేట్లకు అప్పగించారు. ఎక్కువ రేటు చెల్లిస్తున్నారనే విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. టెం డర్లు పిలిచి తక్కువ ధర ముద్రణకు ఎవరు ముందుకొచ్చి ఉంటే వారికి పనులు అప్పగించి ఉంటే బాగుండేది.
- యాదయ్య,
మైత్రి ప్రింటింగ్ ప్రెస్ యాజమాని