వెలగపూడి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ క్లోజ్‌

Former TDP MLA Velagapudi Bar And Restaurant Close - Sakshi

ఇటీవల కల్తీ మద్యం  విక్రయాలు చేస్తుండగా  రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

ఎట్టకేలకు సీజ్‌ చేసిన  అధికారులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇన్నాళ్లకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్‌ మాఫియాకి అడ్డుకట్ట మొదలైంది. ఏడు నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం దన్నుతో ఆయన ‘లిక్కర్‌’ అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఆయన జోలికి వెళ్లేందుకు సాహసించలేని ఎక్సైజ్‌ పోలీసులు ఈ మధ్యనే ఎట్టకేలకు దాడులు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి బినామీ బార్‌లో మద్యం కల్తీ చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. కానీ సరైన చర్యలు లేకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఉన్నత స్థాయి ఆదేశాలతో ఎట్టకేలకు సదరు బార్‌ క్లోజ్‌ చేశారు.  వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకాబస్టాండ్‌ ఎదుట ఉన్న దుర్గా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్‌ఎన్‌ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్‌ను సతీష్‌ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్‌ సిండికేట్‌కే కాదు.. ఎక్సైజ్‌ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలకు సంబంధించి ఈ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి.

అధికారం దన్నుతో గత ఐదేళ్లుగా ఎవరూ దాడులు చేసే సాహసం చేయలేదు. ఈనెల 12వ తేదీన గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సిహెచ్‌ దాస్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్‌ ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్‌ మద్యంలో క్రేజీ డాల్‌ అనే చీప్‌ లిక్కర్‌ను, ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీని ఎంసీ బ్రాందీలో మిక్స్‌ చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్‌ బాటిళ్లను సీజ్‌ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఘటన జరిగిన దరిమిలా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేసు తాత్సారం చేస్తూ వచ్చిన ఎక్సైజ్‌ అధికారులు ఎట్టకేలకు ఆదివారం పొద్దుపోయాక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను సీజ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top