మంత్రి సునీత సమక్షంలోనే  కొట్టుకున్న తమ్ముళ్లు

TDP Leaders Fighting In Anantapur - Sakshi

కనగానపల్లి: ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని – గ్రామ వికాసం కార్యక్రమం మంత్రి పరిటాల సునీతకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బయటపడుతుండడంతో పాటు సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ స్థానికులు నిలదీస్తుండడంతో సమాధానాలు చెప్పుకోలేక మంత్రి సతమతమవుతున్నారు. బుధవారం కనగానపల్లి మండలం చంద్రశ్చర్లలో మంత్రి సమక్షంలోనే తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం చంద్రశ్చర్ల గ్రామానికి చేరుకున్న మంత్రి సునీతకు స్థానిక ఆ పార్టీ నేతలు షాక్‌ ఇచ్చారు.

టీడీపీకి పట్టు ఉన్న ఈ గ్రామంలో మంత్రి ఏకపక్షంగా ఓ వర్గానికే మద్దతు తెలుపుతుండడంతో విభేదాల కుంపటి రాజుకుంది. ఇంతకాలం అవకాశం కోసం కాచుకుని ఉన్న అసమ్మతి వాదులకు మంత్రి రాక ఓ వరంలా మారింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ ద్వారా రూ. 5తో నీటిని అమ్ముకుంటున్నారంటూ సర్పంచ్‌ రామసుబ్బయ్యకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సర్పంచ్‌ వర్గీయులు ఫిర్యాదు చేసిన రామకృష్ణ, సాయిరాం వర్గీయులపై దాడికి దిగారు. మంత్రి వారిస్తున్న వినకుండా ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అర్ధంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి వెనుదిరిగిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top