విద్యార్థులకు ఆధార్ గండం! | SC,CT BC, EBC Student ys rajashekar reddy fees reimbursement | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఆధార్ గండం!

Jan 17 2014 3:43 AM | Updated on Sep 15 2018 2:43 PM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి చేయూత అందించాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి చేయూత అందించాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల నీరుగారుతోంది. సరైన ఏర్పాట్లు చేయకుండానే బయోమెట్రిక్ విధానం అమలు చేయటం, దీనికి ఆధార్ నంబర్‌తో ముడిపెట్టడంతో అటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇటు ఉపకార వేతనాలు అందక వేలాది మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చాలామంది కనీసం దరఖాస్తు చేయలేకపోతున్నారు.
 
 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల మంజూరుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయటం, దీనికి ఆధార్ నంబర్ తప్పనిసరి కావటంతో బడుగు, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యాకోర్సుల కళాశాలలు 273 ఉన్నాయి. వీటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు 72 వేల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంఉపకార వే తనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు వీరందరూ అర్హులే. కానీ కొత్త అడ్డంకుల కారణంగా సకాలం లో మంజూరు కాక వీరి చదువులు ముందుకు సాగడం లేదు.
 
 ఇదీ జరుగుతోంది..
 గతంలో విద్యార్థుల దరఖాస్తులు, హాజరును సంబంధిత అధికారులు పరిశీలించి సంక్షేమాధికారులకు సిఫార్సు చేసేవారు. దీంతో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరయ్యేవి. ఈ ఏడాది నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం ఆయా కళాశాలల యాజమాన్యాలు సొంతంగా బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోవాలి. విద్యార్థుల వివరాలు, ఆధార్ నంబర్ నమోదు చేసి బయోమెట్రిక్ యంత్రంలో బొటనవేలి ముద్ర తీసుకోవాలి. అన్నీ సరిపోలితే విద్యార్థి దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఈ దరఖాస్తును సంబంధిత సంక్షేమ అధికారి ఆమోదిస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు మంజూరవుతాయి. అయితే చాలామంది విద్యార్థులకు ఇప్పటికీ ఆధార్ నంబర్ రాలేదు. మరోవైపు దాదాపు 30 కళాశాలలు బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోలేదు. ఫలితంగా వేలాదిమంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువును ప్రభుత్వం పొడిగించినా ప్రయోజనం ఉండటం లేదు.
 
 ఒక్క బీసీ విద్యార్థుల బకాయే రూ.9 కోట్లు
 గతేడాదికి సంబంధించి జిల్లాలోని 3 వేల మంది బీసీ విద్యార్థులకు రూ.తొమ్మిది కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవటమే దీనికి కారణం. విద్యాసంవత్సరం పూర్తయి తొమ్మిది నెలలు గడిచినా సొమ్ము అందకపోవటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
 ఈ ఏడాది రూ.100 కోట్లు అవ సరంజిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు 2013-14 విద్యాసంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లించేందుకు సుమారు రూ.100 కోట్లు అవసరం. బీసీ విద్యార్థులకు రూ.75 కోట్లు, ఈబీసీలకు రూ.7 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ. 12 కోట్లు, ఎస్టీ విద్యార్థులకు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
 ఇవీ లెక్కలు
  గతేడాది 36,398 మంది బీసీ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈ ఏడాది రెన్యువల్ చేయించుకోవల్సి ఉండగా ఇప్పటివరకు 26,186 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డులు రాని కారణంగా మిగిలినవారు ఇంకా దరఖాస్తు చేయలేదని సమాచారం. ఈ ఏడాది కొత్తగా 30 వేల మంది దరఖాస్తు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 12,920 మంది మాత్రమే చేశారు.
   గతేడాది 2,297 మంది ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేయగా వీరిలో 1882 మంది రెన్యువల్ చేయించుకున్నారు. కొత్తగా 1800 మంది వరకు దరఖాస్తు చేయాల్సి ఉండగా 545 మందే నమోదు చేయించుకున్నారు.
   గతేడాది 4,105 మంది ఎస్సీ విద్యార్థులు నమోదు చేసుకోగా వీరిలో 2,799 మంది మాత్రమే రెన్యువల్‌కు దరఖాస్తు చేశారు. కొత్తగా సుమారు రెండున్నర వేలమంది దరఖాస్తు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1356 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. అలాగే ఎస్టీ విద్యార్థులు 676 మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement