
సాక్షి, జగ్గయ్యపేట : తెలంగాణకు చెందిన సీఐ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో వివాదంలో చిక్కుకున్నాడు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన పుష్పన్ కుమార్ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సీఐగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వ్యక్తిగత కారణాలతో గత మూడేళ్లుగా భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి వీరు విడిగానే ఉంటున్నారు.
అయితే కేసు కోర్టులో ఉండగానే పుష్పన్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య విజయ, కుటుంబ సభ్యులతో కలిసి సీఐ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఆగ్రహించిన పుష్పన్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, విజయ ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో విజయ చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించింది. తనకు అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకొన్న పుష్పన్‌ను అడగటానికి వెళ్తే తనతోపాటు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని, విచారణ పూర్తి కాకుండానే రెండో పెళ్లి చేసుకున్నారంటూ విజయ పుష్పన్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.