భయం.. భయం

Paritala Sunitha Neglect on Anganwadi Centres - Sakshi

శిథిలావస్థకు చేరిన మెజార్టీ అంగన్‌వాడీ భవనాలు

అద్దె భవనాల్లోనూ భద్రత కరువు

మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి సొంత జిల్లాలో దుర్భర పరిస్థితులు

ఈ చిత్రంలో కనిపిస్తున్న పూరి గుడిసె అంగన్‌వాడీ కేంద్రమంటే ఎవరైనా నమ్ముతారా! దీన్ని చూడలంటే అగళి మండలం డి.గొల్లట్టి గ్రామానికి వెళ్ళాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే అరొకర అద్దెకు ఇదిగో ఇలాంటి పూరి గుడిసెను అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుత వేసవిలో గాలి వెలుతురు రాక ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు వచ్చే కేంద్రాలు ప్రమాదాకరంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా,శిశు సంక్షేమశాఖకు జిల్లా చెందిన పరిటాల సునీత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంపై అంతటా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో 5126 అంగన్‌కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2320 కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో 1900 భవనాలు వివిధ స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తికి నోచుకోకపోవడంతో చాలా సెంటర్లు పాత భవనాల్లోనే నడిపిస్తున్నారు. కొన్నింటికి కొత్త భవనాలు నిర్మాణం చేపట్టకపోవడంతో వాటిలోనే కొనసాగిస్తున్నారు. పూర్తి శిథిలావస్థకు చేరుకున్న భవనాలు అనేకం ఉండడంతో వాటిలో సెంటర్లు నిర్వహించడానికి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

గుదిబండగా మారిన అద్దెలు
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 3.35 లక్షల మంది లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఇందులో దాదాపు 2.20 లక్షల మంది చిన్నారులు, 66,018 మంది గర్భిణులు, బాలింతలు, 4703 మంది కిశోర బాలికలు ఉన్నారు. వీరందరూ ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం, ఆరోగ్య మెలకువలు తీసుకుంటున్నారు. అయితే అంగన్‌వాడీ భవనాల విషయంలో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల విషయాన్ని పక్కన పెడితే  2320 కేంద్రాలను అద్దె భవనాల్లో నడుపుతుండడం చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం అర్థం అవుతుంది. భవనాల అద్దె కూడా అంగన్‌వాడీ కార్యకర్తలకు గుదిబండగా మారుతోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1000, పట్టణ ప్రాంతాల్లో రూ. 4 వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఈ రేట్లకు కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూడా దొరకడం లేదు. దీనికి తోడు సక్రమంగా అద్దె  బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 9 నెలల నుంచి సెంటర్‌ అద్దెలు పేరుకుపోయాయి. దీంతో చాలా మంది అంగన్‌వాడీ కార్యకర్తలు జీతాల్లో నుంచి, అప్పుల తెచ్చి సెంటర్లు నడుపుతున్నారు.  

త్వరితగతిన నిర్మిస్తాం
జిల్లాలో 1900 అంగన్‌వాడీ కేంద్రాలు కొత్తగా నిర్మిస్తున్నాం. ఇందులో చాలా భవనాలు పూర్తయ్యాయి. కొన్నింటిలో విద్యుత్, నీటి వసతి తదితర పనులు పెండింగ్‌ ఉన్నాయి. వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. త్వరలో ఈ భవానాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు మార్పు చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తాం.  – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, మహిళాశిశు సంక్షేమశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top