కన్న కూతురిని.. కత్తితో.. | Sakshi
Sakshi News home page

కన్న కూతురిని.. కత్తితో..

Published Wed, Mar 29 2017 10:43 AM

కన్న కూతురిని.. కత్తితో.. - Sakshi

చిత్తూరుః మానవత్వం మంట కలిసిపోయింది. కన్నకూతుర్ని కత్తితో పొడిచి చంపింది ఓ కసాయి తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కుర్చివేడు గ్రామంలో నివాసముంటున్న యోగ మూర్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. ఏడేళ్ల కిందట కుమారి అనే మహిళతో ఆయనకు వివాహమైంది. వీరికి లాస్య(6) కుమార్తె ఉంది. చిత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఇటీవల జమ్ము-కశ్మీర్‌ నుంచి  యోగా మూర్తి 50 రోజుల సెలవుపై ఇంటికి వచ్చాడు. మంగళవారం తమిళనాడులోని ఓ ఆలయానికి దేవుని దర్శనం కోసం వెళ్లాడు.
 
అయితే, 11 గంటల ప్రాంతంలో లాస్యకు ఆరోగ్యం సరిగాలేదని కుమారి మూర్తికి ఫోన్‌ చేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తాను బయలుదేరుతున్నారని బదులిచ్చాడు భర్త. మరో రెండు గంటల అనంతరం తిరిగి భర్తకు ఫోన్‌ చేసిన కుమారి.. లాస్య చనిపోయిందని చెప్పింది. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్నాడు. ఈ లోగా మూర్తికి ఫోన్‌ చేసిన గ్రామస్తులు లాస్య మరణం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. ఇంటికి చేరుకున్న మూర్తి బిడ్డను కత్తితో పొడిచి చంపేశారని నిర్ధారించుకున్నాడు.
 
ఇంత కిరాతకమైన పని ఎవరు చేశారని భార్యను ప్రశ్నించాడు. కుమారి మిన్నకుండటంతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆమెను ప్రశ్నించారు. ఈ లోగా పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకోవడంతో కుమారి పోలీసులకు లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, లాస్యను చంపడానికి వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ కోణంలోనే నిందితురాలిని ప్రశ్నిస్తున్నారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement