
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్‌లోని పెని వద్ద తీరాన్ని దాటి బలహీనపడింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరం వద్ద తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం అయింది. జార్ఖండ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీంతో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవవచ్చునని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా.. ఒడిశాలో కొంతభాగం వరకు రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్రలో కొంతభాగం వరకు రుతుపవనాలు వ్యాపించాయి.