రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లాకు మంజూరైన పథకం ఏమైనా ఉందా అని తెలుగుదేశం నాయకులను రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి ప్రశ్నించారు.
నంద్యాల: రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లాకు మంజూరైన పథకం ఏమైనా ఉందా అని తెలుగుదేశం నాయకులను రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేస్తున్న జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు నోరు మెదపకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా అంటే ముఖ్యమంత్రికి గిట్టడం లేదన్నారు. అందులో భాగంగానే రాజధాని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేగాక జిల్లా ప్రజలను తీవ్రంగా బాధపెట్టడానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్నూలుకు వచ్చి విజయవాడ రాజధానిని చేస్తానని ప్రకటించి మరింత మనోవేదనకు గురి చేశారన్నారు.
ట్రిపుల్ ఐటీని మార్చొద్దు..
కర్నూలు జిల్లాకు మంజూరు చేసిన ట్రిపుల్ ఐటీని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన విద్యాలయాన్ని కర్నూలేతర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. మంజూరైన ఒక విద్యాసంస్థను కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించడం చూస్తుంటే జిల్లాపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతుందని విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలతో రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర అవతరణ తలెత్తుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఓటు రాజకీయం కొనసాగిస్తున్నారని ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని సీపీఎం నంద్యాల డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లాకు ఎలాంటి పథకాలు, విద్యాసంస్థలు మంజూరు కావడం లేదన్నారు.