సీఆర్‌డీఏలో అవినీతి తిమింగలం | Sakshi
Sakshi News home page

సీఆర్‌డీఏలో అవినీతి తిమింగలం

Published Wed, Apr 13 2016 12:37 AM

Identification of illegal assets

ఏసీబీ సోదాల్లో  రూ.4కోట్లపైగా అక్రమ ఆస్తుల గుర్తింపు
గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ఏకకాలంలో తనిఖీలు
దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలు సీజ్

 

గుంటూరు (పట్నంబజారు) : ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. విధి నిర్వహణలో భారీగా అవినీతికి పాల్పడుతూ అక్రమ ఆస్తులు ఆర్జించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్‌డీఏ టౌన్‌ప్లానింగ్ అధికారి నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు  భారీగా కలిగి ఉండడాన్ని గుర్తించారు.

 
గుంటూరులోని కోబాల్డ్‌పేటలో నివాసం ఉండే షేక్ ఫజలూర్ రెహమాన్ ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన అసిస్టెంట్ టౌన్‌ప్లానింగ్ అధికారిగా కర్నూలు, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో పనిచేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విధుల్లో చేరిననాటి నుంచి అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. 1997లో సైతం కర్నూలులో  ఏసీబీ దాడి చేసినట్లు తెలిపారు.

 
మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఏక కాలంలో కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో సోదాలు నిర్వహించారు. గుంటూరులోని ఆయన ఇంటితోపాటు, మిగిలిన ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. గుంటూరు కోబాల్డ్‌పేటలో నివాసం ఉండే ఆ అధికారి సోదరుడు హబీబ్ రెహమాన్ నివాసంలో సైతం తనిఖీలు జరిగాయి. కర్నూలులో ఒక స్థలం, గుంటూరులో అపార్టుమెంట్, ఒక నివాసం, విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న  బిల్డింగ్, ఓ స్థలం కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో మూడు సంవత్సరాల పాటు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసిన రెహమాన్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఏసీబీ దాడులు నిర్వహించేందుకు దృష్టి సారించిందని సమాచారం. ఈ క్రమంలో కోబాల్డ్‌పేట నివాసంలో అక్రమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, భారీ స్థాయిలో నగదు,  కిలోకు పైగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


సుమారు రూ. 4 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెహమాన్ నివాసంలో సోదాలు నిర్వహించడం కోసం విశాఖపట్నం నుంచి డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, సిబ్బంది ప్రత్యేకంగా వచ్చారు. బృందాలుగా ఏర్పడి సీఐల నేతృత్వంలో దాడులు జరిగాయి. గుంటూరులోని నివాసంలో దొరికిన దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లను సైతం రోజుల వ్యవధిలోనే తనిఖీ చేస్తామని అధికారులు స్పష్టంచేశారు. సోదాల్లో సీఐలు రాజశేఖర్, గణేష్, రాజేంద్రలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement