ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గతంలో యువగర్జన సభ జరిగిన ప్రాంతంలోని సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 8వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో మైదానంలో పెరిగిన కంపచెట్లను పొక్లెయిన్‌లతో తొలగించి చదును చేసే పనులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. మైదానంలో డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏర్పాట్లను రాష్ట్రానికి కాబోయే సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
మైదానం ఆవరణ సువిశాలంగా వుండడంతోపాటు ఎంతో చక్కగా వుందన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని, మైదానంలో ఇనుప బారికేడ్లతోపాటు పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. అనంతరం కాబోయే సీఎస్, డీజీపీలు అధికారులతో కలసి ఏఎన్‌యూ వీసీ చాంబర్‌కు తరలివెళ్లారు. సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి యూనివర్సిటీలో వున్న భవనాలు, సదుపాయాలను పరిశీలించి యూనివర్సిటీ అధికారులతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ను సందర్శించారు.
బెటాలియన్‌లో డీజీపీ కార్యాలయం ఏర్పాటుచేస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు గోపినాథ్ జెట్టి, జె.సత్యనారాయణ, అర్బన్, రూరల్ జిల్లాల అదనపు ఎస్పీలు దరావత్ జానకీ, డి.కోటేశ్వరరావు, నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు, డీఆర్‌డీఏ పీడీ సేనాపతి ఢిల్లీరావు, మంగళగిరి, అమరావతి తహశీల్దార్లు సరోజని, శివరామకృష్ణలతోపాటు టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, గరికపాటి మోహనరావు, కేశినేని నాని, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోడెల శివప్రసాదరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమామహేశ్వరావు, బోండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.