ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాతో మోసం

Fraud In West Godavari LLR Mela - Sakshi

జంగారెడ్డిగూడెం : కాదేది వసూళ్లకు అనర్హం అన్నట్లుగా సాగింది ఓ సీఎస్‌సీ నిర్వాహకుడి తీరు. రవాణా శాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాను కాసులు కురిపించే కార్యక్రమంగా మార్చుకున్నాడు. అమాయక గిరిజనులను టార్గెట్‌ చేసుకుంటూ లక్షలాది రూపాయలు కాజేశాడు. మోసపోయామని తెలుసుకున్న గిరిజనులు ఐటీడీఏ పీఓను ఆశ్రయించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రవాణా శాఖ ప్రతీ వాహన చోదకుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జంగారెడ్డిగూడెం సబ్‌యూనిట్‌ ఆధ్వర్యంలో ఇటీవల జీలుగుమిల్లిలో ఒక సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహించారు. ఈ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఆ రోజు సర్వర్‌ సక్రమంగాపనిచేయకపోవడంతో కొద్ది మందికి మాత్రమే స్థానిక ఎంవీఐ సీహెచ్‌ వెంకటరమణ, ఏఎంవీఐ శ్రీనివాస్‌ ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీచేయగలిగారు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. దీనినే సీఎస్‌సీ నిర్వాహకుడు కాసులు పండించే అవకాశంగా మలుచుకున్నాడు. రవాణాశాఖ అధికారులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లో సొంతంగా ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాను ఏర్పాటు చేశారు. ఒక కారులో ల్యాప్‌టాప్‌ తీసుకుని ఆయా గ్రామాలకు వెళ్లి దండోరా వేయించి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా ఏర్పాటు చేశాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాల్సిన వారు పంచాయతీ కార్యాలయానికి రావాలని డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇస్తామని దండోరా వేయించారు. ఐటీడీఏ ద్వారా మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో అమాయక గిరిజనులు వందల సంఖ్యలో క్యూకట్టారు. ఇలా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో సదరు సీఎస్‌సీ నిర్వాహకుడు మేళాను ఏర్పాటు చేశారు.

వాస్తవానికి మోటార్‌ సైకిల్‌ ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.260 తీసుకోవాల్సి ఉండగా సదరు నిర్వాహకుడు రూ.600, కారు లేదా ట్రాక్టర్‌కు అయితే రూ.410 తీసుకోవాల్సి ఉండగా రూ.1000 వరకు వసూలు చేశాడు. అంటే ఒక్కొక్క ఎల్‌ఎల్‌ఆర్‌కు రెట్టింపుపైగా వసూలు చేశాడు. సుమారు 2500 స్లాట్‌లు బుక్‌ చేశాడు. ఈ విధంగా లక్షలాది రూపాయలు దండుకున్నాడు. దీంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సెప్టెంబర్‌ 2వ వారం వరకు కూడా ఎల్‌ఎల్‌ఆర్‌కు స్లాట్‌లకు ఖాళీలేదు. సదరు నిర్వాహకుడు బుక్‌ చేసిన స్లాట్‌కు సంబంధించి గిరిజన యువకులు ఎంవీఐ కార్యాలయానికి వచ్చి లైసెన్స్‌ ఇమ్మని అడగడంతో రవాణా శాఖాధికారులు అవాక్కయ్యారు. దీనికోసం టెస్ట్‌ నిర్వహించడంతో వారంతా అవగాహన లేక టెస్ట్‌లో విఫలమయ్యారు. దీంతో గిరిజనులు ఐటీడీఏ పీఓ హరేంద్రప్రసాద్‌కు ఫిర్యాదుచేశారు. వెంటనే ఆయన స్థానిక ఎంవీఐ సీహెచ్‌ వెంకటరమణను అడగ్గా తామేమీ ఎల్‌ఎల్‌ఆర్‌మేళా నిర్వహించలేదని స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐటీడీఏ మేనేజర్‌కు ఆదేశాలు జారీచేశారు. అయినా ఫలితం లేకపోయింది. గిరిజనులు మాత్రం డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం స్థానిక ఎంవీఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవీఐ వెంకట రమణ సీఎస్‌సీ హెడ్‌ అయిన ఏలూరుకు చెందిన రాజుకు ఫోన్‌లో జీలుగుమిల్లి సీఎస్‌సీ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ చర్యలు లేవు. తామంతా మోసపోయామని, తమ వద్ద ఎల్‌ఎల్‌ఆర్‌ పేరుతో లక్షలాది రూపాయలు సీఎస్‌సీ నిర్వాహకుడు వసూలు చేశాడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top