మాజీ ఎమ్మెల్యే కాటసానికి పుత్రశోకం

Former MLA Katasani Son Was Sucide - Sakshi

ఉరివేసుకుని పెద్ద కుమారుడు  ఆత్మహత్య 

దుఃఖ సాగరంలో కాటసాని కుటుంబం 

సాక్షి, బనగానపల్లె : వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి పుత్రశోకం కలిగింది. పెద్దకుమారుడు నాగార్జునరెడ్డి(26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులకు కుమార్తెలు ప్రతిభ, ప్రణతి, కుమారులు నాగార్జునరెడ్డి, ఓబుళరెడ్డి ఉన్నారు. కుమార్తెలద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భార్యే ప్రతిభ. నాగార్జునరెడ్డి బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్, బెంగళూరులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించేవాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బనగానపల్లెకు వచ్చాడు. రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. అయితే ఉదయం 10 గంటలైనా గది నుంచి బయటకురాకపోవడంతో కుటుంబ సభ్యులు గది వద్దకు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. 

కన్నీటి పర్యంతమైన కాటసాని దంపతులు 
పెద్దకుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండడంతో కాటసాని రామిరెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకొని కాటసాని దంపతులను ఓదార్చారు. విషయం తెలిసిన క్షణాల్లోనే కాటసాని నివాసం జనసంద్రమైంది. 

ప్రముఖుల నివాళి.. 
కాటసాని నాగార్జునరెడ్డి మృతదేహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్‌సీపీ పత్తికొండ ఇన్‌చార్జ్‌ కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నేత గంగుల నాని, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసార«థిరెడ్డి, నంద్యాల టీడీపీ నాయకులు శ్రీధర్‌రెడ్డి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. 

దహన సంస్కారాలు: 
పట్టణ శివారులోని అవుకు రోడ్డులో ఉన్న కాటసాని సొంత స్థలంలో నాగార్జునరెడ్డికి సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.  సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి  బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top