భళా.. మీనరా'సి'

Fish Huntings In West Godavari - Sakshi

నరసాపురం తీరంలో ముమ్మరంగా వేట

వరదనీరు చేరికతో తీరానికి వస్తున్న చేపలు

రికార్డుస్థాయిలో పట్టుబడి

20 రోజుల్లో రూ.400 కోట్ల మేరకు ఎగుమతి

ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా బోట్లు రాక

పశ్చిమ గోదావరి, నరసాపురం : నరసాపురం తీరంలో గత 15 రోజులుగా ముమర్మంగా వేట సాగుతోంది. వందల సంఖ్యలో మెకనైజ్డ్‌ బోట్లు, ఫైబర్‌బోట్లు వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలో విశాఖతీరంతో సహా ఎక్కడా లేని విధంగా స్థానికంగా మత్స్యసంపద దిగుబడి వస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. విరామం లేకుండా వేట సాగిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు గోదా వరి ద్వారా వచ్చి సముద్రంలో కలుస్తుండటంతో చేపలు పైకి ఎగబడుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యం లోనేసాధారణంకంటే ఎక్కువ మత్స్యసంపద ప్రస్తుతం దొరుకుతోందని అంటున్నారు. ఇది ప్రతీ ఏడాది కని పించే పరిస్థితే. అయితే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతున్నదని మత్స్యకారులు అంటున్నారు. గడిచిన 20 రోజుల్లోనే రూ. 400 కోట్ల విలువైన మత్స్యసంపద స్థానికంగా ఎగుమతి అయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ప్రతీఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జూన్‌ 15వ తేదీతో వేట నిషేధకాలం ముగిసింది. నిషేధం తరువాత గడిచిన నెలరోజుల్లో ఆశాజనకంగా వేట సాగుతోంది. మొన్నటి తుఫాన్‌ హెచ్చరిక తప్పస్తే ప్రకృతి కూడా వేటకు సహకరించడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర జిల్లాల నుంచి భారీగా బోట్లు
బంగాళాఖాతానికి చేరువగా ఉండటంతో నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతుంది. ఇటు నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి అటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద గోదావరి సముద్రంలో కలుస్తుంది. వర్షాలు భారీగా పడటంతో వరదదనీరు భారీగా సముద్రంలో కలుస్తోంది. దీంతో చేపలు ఎక్కువగా పడున్నాయి. దాటికి తోడు 61 రోజుల సుదీర్ఘవేట నిషేధకాలం తరువాత మత్స్యసంపద అపరిమితంగా లభ్యమవుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు ఇక్కడికే చేరుకుంటున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ నరసాపురం తీరంలో 300 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి.

20 రోజుల్లో రూ. 400 కోట్లపైనే వ్యాపారం
గడిచిన 20 రోజుల్లో నరసాపురం తీరంలో రూ. 400 కోట్లు వరకూ వ్యాపారం సాగినట్టు అంచనా. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఇక టైగర్‌ రకానికి చెందిన రొయ్యలు దొరుకున్నాయి. ఈ రొయ్యలను సీడ్‌ ఉత్పత్తి నిమిత్తం ముంబాయ్, పూణేల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు.  ఇక స్థానికంగా అత్యంత డిమాండ్‌ ఉన్న పులసల జాడ కూడా కనిపిస్తుందని మత్స్యకారులు చెపుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top