సూపర్‌ సైక్లోన్‌గా ఫొని.. శ్రీకాకుళానికి కుంభవృష్టి | Sakshi
Sakshi News home page

ఫొని తుఫాను ఎఫెక్ట్‌.. శ్రీకాకుళంలో రెడ్‌ అలర్ట్‌

Published Thu, May 2 2019 5:22 PM

Fani Cyclone Effect High Alert Alarmed In AP - Sakshi

సాక్షి, అమరావతి : కొద్ది సేప‌టి క్రిత‌మే ఫొని సూప‌ర్ సైక్లోన్‌గా మారినట్లు ఆర్టీజీఎస్‌ అధికారులు వెల్లడించారు. విశాఖ‌ప‌ట్నానికి 175 కిలోమీట‌ర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశ‌గా కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ పెను తుపాను ద‌క్షిణ ఒడిశా వైపు దూసుకెళుతున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం తీర‌ ప్రాంత మండ‌లాల్లో కుంభ‌వృష్టి కురిసే సూచ‌న‌లు ఉన్నట్లు తెలిపారు. ఫొని తుఫాను ప్రభావం ఈ రాత్రినుంచి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జాతీయ రహదారిపై ఈ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరించటానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. వేగంగా ఉత్తారాంధ్ర వైపు దూసుకువస్తోంది. దీంతో శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో ఆర్టీజీఎస్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఒడిశాలోని పూరీకి 320 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 170 కిలోమీటర్ల దూరంలో ఫొని కేంద్రీకృతమైంది. రేపు గోపాల్‌పూర్‌-చాంద్‌బలి మధ్య ఫొని తీరందాటనుంది. తీరం దాటే సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖ తీరం వెంబడి గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. భీముని పట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో 10వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నెంబర్‌,  కాకినాడ పోర్టులో 5వ నెంబర్‌ ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.

అలర్ట్‌ అయిన అధికార యంత్రాంగం
శ్రీకాకుళం : ఫొని ప్రభావం ఉండనున్న 13 మండలాల్లో 43 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పూరిళ్లు, రేకుల ఇళ్లళ్లో ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్‌ అయ్యింది. నాగావళి, వంశధార, మహేంద్రతనయ బహుదా నదుల్లో వరద నీరు వస్తుందని ఒడిశా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇచ్చాపురం, పలాస, నరసన్నపేట, టెక్కలి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో IAS అధికారిని నియమించింది ప్రభుత్వం. తుపాను ప్రభావిత మండలాలు 17 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. 17 మండలాల్లో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాతిక వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. లక్ష మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రతి పునరావాస కేంద్రం వద్ద గ్రామధికార్లతో పాటు పోలీస్, ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. శుక్రవారం రోజు మొత్తం పునరావాస కేంద్రాలు కొనసాగనున్నాయి.

Advertisement
Advertisement