రేణిగుంట మండలం మామండూరు-కుక్కలదొడ్డి మధ్య గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు, కోయంబత్తూరుకు...
మామండూరు(రేణిగుంట): రేణిగుంట మండలం మామండూరు-కుక్కలదొడ్డి మధ్య గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు, కోయంబత్తూరుకు చెందిన రమేష్(36), మధుసూదనన్(39) అక్కడికక్కడే మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరవణన్ మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న టాటా ఇండికా కారు, తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీ బస్సు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారును నడుపుతున్న మధుసూదనన్, కారులో ప్రయాణిస్తున్న రమేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా శ్రీధర్, శరవణన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శరవణన్ మృతి చెందాడు.
మధుసూదనన్ కారులో ఇరుక్కు పోవడంతో స్థానికులు అతికష్టం మీద వెలికి తీశారు. తమిళనాడు, కోయంబత్తూరులోని శ్రీ కామధేను నగర్, కేఆర్ పురం, అవరంపాళెం రోడ్, పీలమేడు ప్రాంతాలకు చెందిన ఈ నలుగురూ హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రేణిగుంట సీఐ రామచంద్రారెడ్డి, ఎస్‌ఐ భాస్కర్ నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.