
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా అక్కడ కీలక నేతల్ని కలవాల్సి ఉన్నందున ఢిల్లీ పర్యటనను పొడిగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ నెల 8 (గురువారం)న పులివెందుల, పెనుకొండలో సీఎం పర్యటనలు రద్దయ్యాయి. పెనుకొండలో కియా కొత్తకారు విడుదలకు సీఎం బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించనున్నారు.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ గత రెండు రోజులు బిజీబిజీగా గడిపారు. ఈ బుధవారం రాత్రి 10 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన ఆయన, నేటి మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం కలిశారు.