ఈనాం భూములు స్వాహా!

24,614 acres of land swaha - Sakshi

24,614 ఎకరాలు ఇతరుల చేతుల్లోకి..

చట్ట విరుద్ధంగా విక్రయించిన ఈనాందారులు

రిజిస్ట్రేషన్లు అనుమతించేందుకు ప్రభుత్వ పెద్దల కసరత్తు

టీడీపీ నేతల ఒత్తిడితో చట్ట సవరణలకు ప్రతిపాదనలు

వేల కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర

ఈ భూములన్నీ చారిటబుల్, దేవాదాయ సంస్థలవే...

సాక్షి, అమరావతి: 1956 ఈనాం(అబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌) చట్టం ప్రకారం.. ఈనాం భూములను చారిటబుల్‌ సంస్థలు, దేవాలయాలకు సేవలందిస్తున్న వారు కేవలం అనుభవించాలి. ఇతరులకు బదిలీ చేయడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కు ఉండదు.
1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఆ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడం నేరం. ఇప్పటికే అలాంటివి జరిగితే అవేమీ చెల్లుబాటు కావు.
2013లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం.. ఈనాం భూములకు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు కావు. ఆ భూములను నిర్దేశిత సంస్థలకు సేవలందిస్తున్న వారు ఆ సేవలు అందించే సమయం వరకు మాత్రమే అనుభవించాలి.
♦  2015 డిసెంబర్‌లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వకూడదు. ఆ భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధించాలి.

ఈనాం భూముల విషయంలో చట్టాలు, కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు లెక్కచేయడం లేదు. రాష్ట్రంలో అత్యంత విలువైన ఈనాం భూములను మింగేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన వేలాది ఎకరాల ఈనాం భూములను టీడీపీ నేతలకు దఖలు పరిచేందుకు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసేందుకు సన్నద్ధం కావడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

చట్టవిరుద్ధంగా చేతులు మారిన ఈనాం భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా నిషేధిత ఆస్తుల జాబితా(పీఓబీ)లో పెట్టాలంటూ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా తమ వారికి ఈ విలువైన ఆస్తులను కట్టబెట్టేందుకు సర్కారు పెద్దలు చకచకా పావులు కదిపారు. చట్ట సవరణ ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. దీంతో సర్కారు తీరు కంచే చేను మేసిన చందంగా మారిందని అధికారులు అంటున్నారు.

చట్ట సవరణ ప్రతిపాదనలు
ఈనాం భూములపై కన్నేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అధికారులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనాం భూములను రైత్వారీ పట్టాలున్న వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలుగా చట్టంలో సవరణలు ప్రతిపాదించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. అందుకు అనుగుణంగా అధికారుల కమిటీ చట్ట సవరణ ప్రతిపాదనలను రూపొందించి, న్యాయశాఖ పరిశీలనకు పంపించింది.

అయితే, హైకోర్టు తీర్పు మేరకు ఈనాం భూముల్లో రైత్వారీ పట్టాలతో ఉన్న వారిని అక్రమణదారులుగా భావించి తొలగించాల్సి ఉంది. అయితే, హైకోర్టు తీర్పును ప్రభుత్వ పెద్దలు లెక్కచేయడం లేదు. చారిటబుల్, దేవాలయాల సంస్థలకు సేవలందించకుండా ఈనాం భూములను అనుభవిస్తున్న వారిని ఆక్రమణదారులుగా పరిగణించి వారి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆయా చారిటబుల్‌ ట్రస్టులు, దేవాలయాల సంస్థల ఆధీనంలో ఉంచాలని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది.

రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర
తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున చట్టసవరణ చేయించి భూములను చట్టబద్ధంగా సొంతం చేసుకోవాలనే స్వార్థంతో కొందరు టీడీపీ నేతలు చట్టవిరుద్ధంగా బినామీ పేర్లతో ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇప్పించుకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసుకున్నట్లు పత్రాలు రాయించుకున్నారు. మరికొందరు నామమాత్రపు ధరలతో చట్టవిరుద్ధంగా కొన్నారు. దీంతో అత్యంత విలువైన ఈ భూములన్నీ అధికార టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి విక్రయించుకోవడం ద్వారా రూ.వేల కోట్లు ఆర్జించాలనే ఉద్దేశంతో చట్టసవరణకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించారు. వారికీ వాటా ఉండటంతో అందుకు తలూపిన ప్రభుత్వ పెద్దలు ఓకే చెప్పేశారు.

చట్టం ఉన్నా అమలేదీ?
గతంలో కొందరు 1956 ఈనాం(అబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌) చట్టానికి వ్యతిరేకంగా ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇచ్చారు. ఈనాందారులు కొన్ని భూములను ఇతరులకు అమ్మేశారు. ఈ అంశంపై 1996లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఆ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడం నేరమని, ఇప్పటికే అలాంటివి జరిగితే అవేమీ చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2013లో రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈనాం భూములకు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు కావని, ఆ భూములను ఆయా సంస్థలకు సేవలందిస్తున్న వారు ఆ సేవలు అందించే సమయం వరకు మాత్రమే అనుభవించాలని స్పష్టం చేసింది.

అలాగే ఈనాం భూములను విక్రయించడానికి వీల్లేదంటూ 1956 నాటి చట్టానికి 2013లో సవరణ చేశారు. ఆ చట్టం అమల్లో ఉన్నప్పటికీ రైత్వారీ పట్టాలు గల ఈనాందారులు ఈనాం భూములను ఇతరులకు విక్రయించేశారు. అలా విక్రయించినవారు ఆ భూములను కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించడానికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈనాం భూములను విక్రయించుకోవడానికి అనుమతించాల్సిందిగా రైత్వారీ పట్టాలున్న కొందరు ఈనాందారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

కేవలం ఆయా సంస్థలకు సేవలందించిన సమయంలో ఆ భూములను అనుభవించడానికే హక్కు ఉంటుందని,  ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఆ భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధించాలని 2015 డిసెంబర్‌లో హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈనాం భూములను 22–ఎ(1)సి కింద ‘రిజిస్ట్రేషన్ల నిషేధం’ జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇప్పుడు 2013 నాటి చట్టంలో సవరణలు చేయడం ద్వారా రైత్వారీ పట్టాలు గల 24,614 ఎకరాల ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు.

ఈనాం భూములు అంటే?
పూర్వం దేవాలయాలను నిర్మించిన వారు అందులో దూప దీప నైవేధ్యాల కోసం పూజారులకు/ పనివారి పేరుతో భూములు/ఆస్తులు రాసి ఇచ్చారు. తర్వాత కాలంలో కూడా దాతలు ఇలా పనివారికి భూములు రాయించారు. వీటినే ఈనాం భూములు అంటారు. పూజారులు/ ఇతర పనివారలు ఆయా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వర్తించినంత కాలం ఈనాం భూములను అనుభవించుకోవచ్చు. ఈ భూముల్లో పంటలు, ఇతరాల ద్వారా వచ్చే ఆదాయంతో వారు జీవనం సాగిస్తూ స్వామివారికి పూజాధికారాలు నిర్వహించడం కోసం దాతలు ఈ భూములను ఈనాం కింద కేటాయించారు. వీటిపై ఈనాందారులకు అనుభవ హక్కులు తప్ప విక్రయ హక్కులు లేవని చట్టాలతోపాటు కోర్టులు కూడా తేల్చిచెప్పాయి.

ఒకవేళ ఇప్పటికే ఎక్కడైనా ఈనాం భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగినా అవి చెల్లవని, వాటిని రద్దు చేసి ఈ భూములను క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22 (ఎ)1 కింద నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టాలని ఉన్నత న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. ఆ భూములను సొంతం చేసుకోవడం, ఇతరులకు విక్రయించడం చట్టరీత్యా నేరం. 1956 ఈనాం(అబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌) చట్టంప్రకారం.. ఈనాం భూములను చారిటబుల్‌ సంస్థలు, దేవాలయాలకు సేవలందిస్తున్న వారు కేవలం అనుభవించాలి. ఇతరులకు బదిలీ చేయడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కు ఉండదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top